e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home Top Slides ఎకరాకు లక్షన్నర

ఎకరాకు లక్షన్నర

ఎకరాకు లక్షన్నర
  • ఆయిల్‌పామ్‌ సాగుతో ఆదాయం మస్త్‌
  • సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిరులు కురిపిస్తున్న పంట
  • ఖర్చులు పోను.. 80,000 పైగా లాభం

పండించే పంట లాభం తెచ్చిపెట్టాలి..

రైతు ధనవంతుడు కావాలి.. ఈ లక్ష్యంతోనే రాష్ట్రసర్కారు వినూత్న పంటలను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే సిరులు కురిపించే ఆయిల్‌పామ్‌ పంటను సాగుచేయాలని
అన్నదాతకు సూచిస్తున్నది. ఎకరానికి రూ.1.5 లక్షల ఆదాయం వస్తున్నది. ఇందులో ఖర్చులుపోనూ కనీసం రూ.80 వేల వరకు మిగులుతున్నది. ప్రభుత్వ సహకారంతో రైతుల ఇంట ఈ పంట సిరులు కురిపించే వాతావరణం నెలకొన్నది. ఇందుకు ఖమ్మం జిల్లాలోని ఆయిల్‌పామ్‌ రైతులు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసినదానికంటే ఎక్కువ సంతృప్తి లభిస్తున్నదని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఉద్యోగం కంటే ఎక్కువ సంతృప్తి

మాకున్న 35 ఎకరాల భూమిలో దశల వారీగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రారంభించాం. నాన్న లక్ష్మణరావుతో కలిసి సొంతంగా పంట సాగు చేసుకొంటున్నాం. సగటున 12 మెట్రిక్‌ టన్నులు పండిస్తున్నాం. ఖర్చులు పోను ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం వస్తున్నది. ఉన్నత చదువు చదివినా.. ఉద్యోగం కంటే సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నా.

- Advertisement -

సోయం మల్లికార్జున్‌, రాచూరుపల్లి, దమ్మపేట మండలం

ఖమ్మం, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతికూల వాతావరణం ఉన్నా ఢోకా లేని పంట ఏదన్నా ఉందంటే అది.. ఆయిల్‌పామ్‌. రైతుకు లాభాలను తెచ్చిపెట్టే పంట కూడా ఇదే. అన్ని ఖర్చులు పోగా రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం వస్తుండటం కూడా రైతులను ఆకర్షిస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఆయిల్‌పామ్‌ను పండించే విధానం, పెట్టుబడి, మార్కెటింగ్‌, లాభం వంటి వాటి గురించి తెలుసుకోవడానికి వివిధ జిల్లాల రైతులు విజ్ఞానయాత్రలు చేస్తున్నారు. ఇక్కడి ఆయిల్‌పామ్‌ కర్మాగారాలను సందర్శిస్తున్నారు. సాగులోని మెళకువల గురించి తెలుసుకొంటున్నారు. దేశంలో ఆయిల్‌పామ్‌కు ఉన్న డిమాండ్‌ను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటసాగును ప్రోత్సహిస్తున్నది. పంట సాగు కోసం సబ్సిడీకే పామాయిల్‌ మొక్కలు, డ్రిప్‌ సౌకర్యం, ఉచిత విద్యుత్తు, సాగునీరు సౌలభ్యం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నది. తెలంగాణ రైతాంగం ఇప్పుడు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టిసారించింది. వ్యవసాయంపై ప్రత్యేక విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రైతులకు ఆయిల్‌పామ్‌ సాగుచేయాలని సూచిస్తున్నారు. ఈ పంట సాగుచేసే రైతులకు ఎకరానికి రూ.36 వేల నగదుతోపాటు మొక్కలను సబ్సిడీ ధరలకు ఇవ్వటం, రైతుబంధు సాయం అందించటంతో రాష్ట్రంలో వివిధ జిల్లాల ప్రముఖులు, వ్యవసాయరంగ నిపుణులు దీనిపై అధ్యయనంచేస్తున్నారు.

ఎకరానికి రూ.1.50 లక్షల ఆదాయం

ఆయిల్‌పామ్‌ గెల నుంచి వంటనూనెకు ఉపయోగపడే క్రూడాయిల్‌తోపాటు ఆయిల్‌పామ్‌ గింజ, పెంకు సైతం విద్యుత్తు ఉత్పత్తికి, కాస్మొటిక్స్‌ తయారీకి ఉపయోగపడే నూనెను తయారుచేయవచ్చు. ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తి చేస్తున్నది. అప్పారావుపేట ఫ్యాక్టరీ ద్వారా 13 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి అవుతున్నది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఉత్పత్తి అయ్యే క్రూడాయిల్‌ను రిఫైనరీ యూనిట్లు కొనుగోలుచేసి వంటనూనెగా మార్చి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తాయి. ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న క్రూడాయిల్‌ విజయ బ్రాండ్‌ ద్వారా వంటనూనెగా వినియోగదారులకు చేరుతున్నది. ఒక్కో ఫ్యాక్టరీ రోజుకు 900 టన్నుల ఆయిల్‌పామ్‌ గెలలను క్రషింగ్‌ చేస్తున్నది. ఒక్కో ఎకరానికి 12 నుంచి 16 టన్నులు దిగుబడి లభిస్తున్నది. అంటే ఎకరానికి రూ.1.50 లక్షలకు పైచిలుకు ఆదాయం రైతుకు అందుతున్నది.

ఎకరాకు లక్షన్నర

రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 42 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతున్నది. పంటను విక్రయించేందుకు వీలుగా 2007లో ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో ఆయిల్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. దీంతో అప్పటి వరకు తక్కువ మొత్తంలో సాగవగా, పామాయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పడటంతో విస్తీర్ణం మరింత పెరిగింది.

2017లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి దమ్మపేట మండలం అప్పారావుపేటలో రూ.100 కోట్లతో పామాయిల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయించారు. రెండో ఫ్యాక్టరీ సైతం ఏర్పాటు కావటంతో పామాయిల్‌ సాగు మరింత ఊపందుకొన్నది. పూర్తి గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పామాయిల్‌ సాగు గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులను నింపింది.

రాచూరిపల్లికి చెందిన గిరిజన రైతు మల్లికార్జున్‌ తన 24 ఎకరాల భూమిలో పామాయిల్‌ సాగు చేస్తూ అద్భుత ఫలితాలు సాధించారు. రూ.16 లక్షల విలువైన కారును కొనుక్కొనే స్థాయికి ఎదిగాడు. పంట దిగుబడి వచ్చేది నాలుగేండ్ల తర్వాతే అయినా, ఆ లోగా పలు రకాల అంతర పంటలు వేసుకొనే వెసులుబాటు ఉండటంతో రైతులు మంచి ఫలితాన్ని పొందుతున్నారు.

20 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగుచేయడానికి 11.40 కోట్ల మొక్కలు అవసరం కాగా, ఈ ఏడాది 10 లక్షల మొక్కలను అప్పారావుపేటలోని ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ సిద్ధంచేసింది.

ఎకరాకు లక్షన్నర

కొత్తగా ఆయిల్‌ ఫ్యాక్టరీల ఏర్పాటు

రైతులు పండించిన ఆయిల్‌పామ్‌ను వంటనూనెగా మార్చేందుకు రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న కోరికకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రైవేట్‌ సంస్థకు రిఫైనరీ యూనిట్‌ మంజూరు చేసింది. అటు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొర్రూరు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట వంటి ప్రాంతాల్లో కొత్తగా ఆయిల్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏటా ఆయిల్‌పామ్‌ సాగు పెరుగుతుండటంతో తెలంగాణలో 13 కొత్త ఫ్యాక్టరీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

హ్యాపీగా ఆయిల్‌పామ్‌ రైతులు

దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే పంట.. ఆయిల్‌పామ్‌. సమైక్య రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్‌ను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరిగింది. స్వరాష్ట్రంలో కొత్తగా ఫ్యాక్టరీలను నిర్మించుకొన్నాం. ఇప్పుడు 1,400 ఎకరాలకు పైగా పంట సాగులోకి వచ్చింది. ఆయిల్‌పామ్‌ సాగుతో అన్ని వర్గాల రైతులు హ్యాపీగా ఉన్నారు.

ఆలపాటి రామచంద్రప్రసాద్‌, రైతు, దమ్మపేట

రైతులకు ఆర్థిక తోడ్పాటు

రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగును 20 లక్షల ఎకరాల్లో విస్తరింపజేయాలని సీఎం కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణ యం రైతులకు ఆర్థిక తోడ్పాటునిస్తుంది. పంట సాగు వేగంగా విస్తరిస్తున్నది. 1995 లో ఈ పంట సాగును ప్రారంభించినపుడు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఈ పంట రైతులకు దీర్ఘకాల ఆదాయ వనరుగా మారుతుంది.

కందిమళ్ల కృష్ణారావు, రైతు, విశ్రాంతి ఉద్యోగి, దమ్మపేట

ముఖ్యమంత్రి కృషి అభినందనీయం

ప్రతికూల వాతావరణంలోనూ రైతు శ్రమకు తగిన ఫలితాన్నిచ్చే పంట.. ఆయిల్‌పామ్‌. ఈ పంటసాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి అభినందనీయం. ఇది దేశవ్యాప్తంగా పామాయిల్‌ రంగంలో తెలంగాణ రాష్ట్ర కీర్తిని సువర్ణ అక్షరాలతో లిఖించడానికి దోహదపడుతుంది. 20 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని సంకల్పించటం వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి, చిత్తశుద్ధికి నిదర్శనం. రైతుబాంధవుడిగా కేసీఆర్‌ను ఆయిల్‌పామ్‌ రైతులు భావిస్తున్నారు. ఎకరానికి రూ.36 వేల నగదు, సబ్సిడీ ధరకు ఆయిల్‌పామ్‌ మొక్క, ఎరువులు, డ్రిప్‌ వంటివి ఇస్తుండటం సీఎం కేసీఆర్‌కే సాధ్యం. రైతులకు ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించేందుకు మలేషియా, ఇండోనేషియాలో చేస్తున్న సాగు తీరు, సాంకేతిక పరిజ్ఞానంపై రైతు విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయాలి. ఆయిల్‌ఫెడ్‌ బోర్డులో రైతులకు ప్రాధాన్యం ఇవ్వటం హర్షణీయం.

తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి, ఆయిల్‌పామ్‌ సాగు రైతు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎకరాకు లక్షన్నర
ఎకరాకు లక్షన్నర
ఎకరాకు లక్షన్నర

ట్రెండింగ్‌

Advertisement