శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 01:42:04

లక్ష మందికి అందిన టీకా!

లక్ష మందికి అందిన టీకా!

  • సోమవారంనుంచి ప్రైవేట్‌ వైద్యసిబ్బందికి

హైదరాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రాష్ట్రంలో విస్తృతంగా సాగుతున్నది. తొలిదశలో వైద్య సిబ్బందికి కొవిషీల్డ్‌ టీకాలను వేస్తున్నారు. శుక్రవారం 489 కేంద్రాల్లో 12,944 మంది వ్యాక్సిన్‌ వేసుకున్నట్టు ఆరోగ్యశాఖ టీకా బులెటిన్‌ పేర్కొన్నది. ఇప్పటివరకు 1,10,248 మందికి టీకాలు వేయడం పూర్తయ్యింది. తొలిరోజు నుంచి దుష్ప్రభావాలు కలిగిన వారంతా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. సోమవారం నుంచి ప్రైవేట్‌ దవాఖానల వైద్యులకు, సిబ్బందికి టీకా వేయడం ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

రాష్ర్టానికి చేరిన 1.68 లక్షల కొవాగ్జిన్‌ డోసులు

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇప్పటివరకు రెండు దఫాలుగా రాష్ర్టానికి చేరుకోగా, శుక్రవారం రెండో దఫా కొవాగ్జిన్‌ చేరుకొన్నది. మొదటిసారి 20 వేల డోసులు రాగా, ఈసారి 1.68 లక్షల డోసులు కోఠిలోని సెంట్రల్‌ కోల్డ్‌ స్టోరేజీకి చేరుకొన్నాయి. 

వ్యాక్సిన్‌ ముసుగులో మోసాలు

కరోనా వ్యాక్సిన్‌ పేరుతో వృద్ధులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ‘డ్రగ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి కాల్‌ చేస్తున్నాం.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఆధార్‌ నంబర్‌ కావాలి. ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పండి’ అని ఫోన్లు చేస్తున్నారు. ఆపై బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సిన్‌ పేరిట ఎవరైనా ఫోన్‌చేసి ఆధార్‌ నంబర్‌, ఓటీపీలు అడిగితే చెప్పొద్దని సూచించింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నది.

VIDEOS

logo