కొవిడ్ రోగుల్లో బ్లాక్‌ఫంగస్ రావడానికి స్టెరాయిడ్లు కారణం కాదని, అకారణంగా వాటిని నిందించవద్దని ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ రాజ్‌కిరణ్ చెప్పారు. రుమటాలజీ (కీళ్లవాతం) చికిత్సలో సుమారు 20 ఏండ్లుగా స్టెరాయిడ్లు ఇస్తున్నానని, ఇప్పటివరకు ఒక్క బ్లాక్‌ఫంగస్ కేసు కూడా నమోదుకాలేదని చెప్పారు. కొవిడ్ రోగులకు ఎక్కువగా స్టెరాయిడ్లు ఇవ్వడం వల్ల మధుమేహం వస్తున్నదన్న అపోహ ఉన్నదని.. ఇది కూడా అవాస్తవమేనని చెప్పారు. స్టెరాయిడ్ల వినియోగం, కొవిడ్ రోగుల్లో కలుగుతున్న దుష్ప్రభావాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్లు వాడటంతో బ్లాక్‌ఫంగస్ వస్తున్నదనేది నిజమేనా?
ఇది ఒక అపోహ. రుమటాలజీ చికిత్సలో చాలా మందికి స్టెరాయిడ్స్ సూచిస్తాం. అయినా ఫంగస్ ఇన్ఫెక్షన్లు నమోదవడం చాలా అరుదు. గత 20 ఏండ్లలో ఎంతో మందికి చికిత్స చేశాను. ఒక్క బ్లాక్‌ఫంగస్ కేసు కూడా నమోదుకాలేదు. బ్లాక్‌ఫంగస్‌కు స్టెరాయిడ్లే కారణమన్న ఆరోపణలు విని ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. రుమటాలజీ అనేది ఆటో ఇమ్యూన్డిసీజ్. రోగనిరోధక శక్తి ఎదురుతిరిగి శరీరంపై దాడి చేసినప్పుడు కీళ్లవాతం వస్తుంది. కరోనా విషయంలోనూ ఇదే జరుగుతున్నది. మొదటిదశలో వైరస్ శరీరంపై ప్రభావం చూపుతున్నది. రెండో దశలో వైరస్ ప్రభావం తగ్గుతున్నది. అదే సమయంలో హైపర్ ఇన్ఫ్లమేటరీ (రోగనిరోధక శక్తి దాడిచేయడం) మొదలవుతున్నది. దీంతో ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు దెబ్బతింటున్నాయి. దీన్ని నియంత్రించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో స్టెరాయిడ్లు వాడాల్సి వస్తున్నది.
బ్లాక్‌ఫంగస్ ముప్పుకు కారణాలు ఏమిటి?
కొవిడ్ సోకినవారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు స్టెరాయిడ్లు వాడితే రోగనిరోధక శక్తి క్షీణిస్తున్నది. దీనికితోడు ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు యాంటిబయాటిక్స్ కూడా వాడుతున్నారు. దీంతో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా చనిపోతున్నది. ఇలా రెండు మూడు కారణాల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు కొవిడ్ రోగుల్లో రక్తం గడ్డకడుతున్నది. కొన్నిసార్లు ముక్కులోని పైపొరల్లో ఉన్న రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే.. కొన్ని రోజులకు అక్కడ ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా బ్లాక్‌ఫంగస్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
స్టెరాయిడ్ల వల్ల కొవిడ్ రోగుల్లో మధుమేహం వస్తున్నదన్న వాదనలపై మీ స్పందన?
బ్లాక్‌ఫంగస్ లేదా మ్యూకోర్ ఎక్కువగా మధుమేహ రోగుల్లో కనిపిస్తున్నది. అంతేతప్ప.. స్టెరాయిడ్లు వాడినవాళ్లకు కొత్తగా మధుమేహం రావడం లేదు. స్టెరాయిడ్ల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వాస్తవమే. అయితే ఇది తాత్కాలికం. అప్పటికే గుర్తించనిస్థాయిలో మధుమేహం ఉన్న వారికి కొవిడ్ సోకిన తర్వాత ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతుంటాయి. కొవిడ్ వైరస్ ఊపిరితిత్తులతోపాటు క్లోమగ్రంధిపై కూడా దాడి చేస్తున్నది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి కొందరిలో మధుమేహ ప్రారంభమవుతున్నది. మరికొన్ని సందర్భాల్లో అనువంశికంగా మధుమేహం ఉన్నవారికి కొవిడ్ సోకిన తర్వాత బయటపడుతున్నది. అంతేతప్ప మధుమేహానికి స్టెరాయిడ్లకు సంబంధం లేదు.
ఇండస్ట్రియల్ ఆక్సిజన్ వాడటంతో బ్లాక్‌ఫంగస్ ముప్పు పెరుగుతున్నదా?
చాలా మంది ఇదే వాదనను తెరపైకి తెస్తున్నారు. పారిశ్రామిక ఆక్సిజన్‌ను మెడికల్ ఆక్సిజన్‌గా వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ ముప్పు పెరుగుతున్నదన్న వాదనకు శాస్త్రీయత లేదు. రెండూ ఒకటే.. ఆక్సిజన్ వేర్వేరుగా ఉండదు. వాడిన మాస్కులనే శుభ్రం చేయకుండా మళ్లీ వాడటం వల్ల బ్లాక్‌ఫంగస్ ముప్పు ఉన్నదన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ దిశగా పరిశోధనలు జరుగాలి.