ములుగురూరల్/గణపురం, మే 23 : వరి కొయ్య మంటలు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. పొగ కారణంగా బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో తల్లీకూతురు మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నారాయణగిరిపల్లె గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నలేంద్ర లక్ష్మి(40), కుమార్తె నలేంద్ర దీపిక(19), కుమారుడు నలేంద్ర సాయికిరణ్‌తో కలిసి బైక్‌పై గణపురం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ వైపు నుంచి కారు వేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న లక్ష్మీ, దీపిక, సాయికిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి, దీపిక మృతి చెందారు. సాయికిరన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమచారం. రోడ్డుకు ఇరువైపులా కొందరు రైతులు వరి కొయ్యలకు మంట పెట్టడంతో గాలికి వ్యాప్తి చెంది దట్టమైన పొగ దారిని కమ్మేసిందని, ఈ క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని స్థానికులు తెలిపారు. కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వారు ఎరగడి మంటలపై ఎగిరి పడ్డారని స్థానికులు పేర్కొన్నారు.