అధికారంలో ఉన్న వారు చేసింది, చేయబోయే పనులు చెప్పుకోవాలి. కానీ దబాయింపులు ఎందుకు. కాంగ్రెస్ ఉడత ఊపులు, పిట్ట బెదిరింపులకు జూబ్లీహిల్స్‌లో ఎవరూ భయపడరు. మోసం చేసిన కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం.
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే సన్నబియ్యం ఎత్తేస్తామని, రేషన్‌కార్డులు రద్దు చేస్తామని జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి బీద అరుపులు, పిచ్చి ప్రేలాపనలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నాడు ఓట్లను కొల్లగొట్టేందుకు ఆరు గ్యారెంటీల పేరిట నమ్మించి ఇప్పుడు గారడీ మాటలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్సోళ్లు ఎన్ని డ్రామాలు చేసినా జూబ్లీహిల్స్‌లో వారి తోక కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీల పేరిట లొల్లి చేసి ఆగం చేసిన హస్తం పార్టీకి గట్టి షాక్ ఇవ్వడం తథ్యమని తేల్చిచెప్పారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చి మోసం చేసిన పార్టీకి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి హైడ్రా పేరిట అరాచకాలు సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. శని, ఆదివారాల్లో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతూ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వాగ్దానాలను విస్మరించి పాలనను గాలికొదిలేసి కమీషన్ల పంపకాల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అమలు చేసిన బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్, న్యూట్రికిషన్ కిట్లను బంద్‌చేసి పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్లో టీటీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడు-సుజాత దంపతులు, డాక్టర్ శ్రవణిక, ఖైరతాబాద్‌కు చెందిన టీడీపీ నేతలు, అలీమస్కతి ఆధ్వర్యంలో వెంగళ్‌రావునగర్‌కు చెందిన ఎంఐఎం నేతలు, నామినేషన్ విత్‌డ్రా చేసుకొని బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చిన ప్రవీణ్, లాయర్ ఇబ్రహీం తదితరులు బీఆర్ఎస్లో చేరారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని, పింఛన్లు డబుల్ చేస్తామని, యువతులకు స్కూటీలు అందిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు ‘అహనా పెళ్లంట’ సినిమా చూపుతున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గోడకు కోడిని వేలాడదీసి పళ్లెంలో పచ్చడి మెతుకులు పెడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్‌రెడ్డి పాలన కూడా ఆ సినిమాకు కొంచెం అటూఇటుగా అట్లనే ఉన్నదని ఎద్దేవా చేశారు. ‘రెండేళ్ల కిందట బాండు పేపర్లమీద రాసిచ్చి, గ్యారెంటీ కార్డులిచ్చి ఇంటింటికీ పంచి, దేవుళ్లపై ఓట్లుపెట్టి, మేం అత్తకు నాలుగువేలు, కోడలుకు రెండున్నర వేలు ఇస్తం, నూరు రోజుల్లోనే అన్నీచేస్తమని గల్లీ గల్లీ తిరిగి లొల్లిలొల్లి పెట్టి ఆగమాగం చేసిన్రు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ ఆడబిడ్డల పెండ్లిళ్లకు లక్ష మాత్రమే ఇస్తున్నడు. నేనైతే తులం బంగారం కూడా ఇస్తన్నడు. కానీ ఎవరికైనా వచ్చిందా?’ అని అక్కడికొచ్చిన మహిళలను అడగ్గా లేదని గట్టిగా బదులిచ్చారు. ‘అయినా కాంగ్రెస్సోళ్లు బంగారమిచ్చేటోళ్లు కాదు. మీ మెడలోని ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోయే వాళ్లు’ అంటూ చురకలంటించారు. కేసీఆర్ పాలనలోని పథకాలను సైతం బంద్‌పెట్టి నయవంచనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి హైడ్రా పేరిట అరాచకాలు సృష్టిస్తున్నారు. శని, ఆదివారాల్లో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతూ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. వాగ్దానాలను విస్మరించి పాలనను గాలికొదిలేసి కమీషన్ల పంపకాల్లో మునిగితేలుతున్నారు.
-కేటీఆర్
రెండేండ్లలో ప్రజలకు ఏం ఉద్ధరించారని కాంగ్రెస్సోళ్లను అడిగితే ఫ్రీ బస్సు గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. భార్యకు ఫ్రీ బస్సు పెట్టి భర్తకు డబుల్ చార్జీలు పెంచారని మండిపడ్డారు. వారి చదువుకొనే పిల్లల బస్సు పాస్ ధరలను 25 శాతం పెంచారని తెలిపారు. ఉచిత బస్సు పేరిట కుడిచేత్తో ఇచ్చి ఎడమచేతితో గుంజుకుంటున్నారు తప్పితే పేదలకు ఒరిగిందేమీలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రూ. 200 పింఛన్‌ను రూ. 2వేలకు పెంచారని, ఆడపిల్లల పెండ్లి చేస్తే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ. లక్ష, ఆ బిడ్డకు కొడుకో, బిడ్డనో పుడితే కేసీఆర్ కిట్, ఆడపిల్లకు రూ.13 వేలు, మగపిల్లాడికి రూ. 12 వేలు ఇచ్చారని గుర్తుచేశారు. బతుకమ్మకు బతుకమ్మ చీరె, రంజాన్‌కు తోఫా, క్రిస్మస్కు కానుక పేరిట బట్టలు పెట్టారని చెప్పారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేసీఆర్ పథకాలకు కోతపెట్టి, ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టిందని దుమ్మెత్తిపోశారు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రాజు కాదని, ప్రజలకు ధర్మకర్త అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
జూబ్లీహిల్స్‌లో గెలిచిన మాగంటి గోపీనాథ్ ఇక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. అందుకే ప్రజలు మూడుసార్లు ఆయనకు పట్టంగట్టారని పేర్కొన్నారు. అయితే అనుకోని పరిస్థితుల్లో మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్దమనసుతో సునీతమ్మకు తాము అండగా నిలిచామని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె భార్యాపిల్లలతో కలిసి జూబ్లీహిల్స్ ప్రజల ముందుకువచ్చారని పేర్కొన్నారు. భర్తను తలుచుకొని భావోద్వేగంతో సునీతమ్మ కన్నీళ్లు పెడితే కాంగ్రెస్ మంత్రులు అపహాస్యం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఓ ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్ దుర్మార్గులకే చెల్లిందని నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ప్రజలు, ముఖ్యంగా ఆడబిడ్డలు ఆలోచించాలని, సునీతమ్మ కన్నీళ్లను వెక్కిరించిన కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుకావాలని స్పష్టంచేశారు. ఏమాత్రం పొరపాటు చేసినా నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు అపార నష్టం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నవంబర్ 11న పై నుంచి మూడో నంబర్‌పైన గల కారు గుర్తుపై ఓటేసి హస్తంపార్టీ నాయకుల కండ్లుతెరిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బాధ్యుడు మన్నె గోవర్ధన్, ఎన్నం శ్రీనివాస్, మహిళా నేతలు షకీలారెడ్డి, సుమిత్రాఆనంద్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మూర్తి, మూర్తుజా, యూసుఫ్, రహీంపాషా తదితరులు పాల్గొన్నారు.
అసలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి? రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసినందుకా? ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లను కూలగొడు తున్నందుకా? హైడ్రా ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నందుకా? డిక్లరేషన్ల ఆశచూపి దగా చేసిందుకా? బుల్డోజర్ తెచ్చి ఇండ్లను నేలమట్టం చేసి పేదలకు నిద్రలేకుండా చేసినందుకా?
-కేటీఆర్
ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేస్తామని శ్రీనివాస్‌నాయుడు ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్లో చేరడం, కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఇప్పటి నుంచి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతం చేసేందుకు కృషిచేస్తామని ప్రకటించారు.
23 నెలల పాలనలో రేవంత్ సర్కారు ఒక్క మంచి పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. చేసింది చెప్పుకోలేకే బెదిరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందర ‘అదిచేస్తాం.. ఇది చేస్తాం..ఉద్ధరిస్తాం’ అంటూ హామీలు గుప్పించి గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలి ఓటేసిన ప్రజలకు నరకం చూపుతున్నారని తూర్పారబట్టారు. తెలంగాణలోని అన్ని రంగాలను, అన్ని వర్గాలను అతలాకుతలం చేశారని నిప్పులుచెరిగారు. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులు తప్ప ఏ వర్గమూ సంతోషంగా లేదని దెప్పిపొడిచారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మేయర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో ప్రజలెవరూ లేరని చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం నిత్యం పోరాడుతున్న బీఆర్ఎస్ పక్షానే ఉన్నారని పేర్కొన్నారు.