e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home తెలంగాణ హైదరాబాద్‌లో తేజస్‌ విడిభాగం

హైదరాబాద్‌లో తేజస్‌ విడిభాగం

  • ఏరో డిఫెన్స్‌లో తెలంగాణ మరో ఘనత
  • హెచ్‌ఏఎల్‌ సహకారంతో రూపొందించిన వీఈఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • హెచ్‌ఏఎల్‌కు తొలి యూనిట్‌ అప్పగింత
  • 2027 నాటికి మార్క్‌-2 పరీక్షలు
  • ఏడాదికి రూ.లక్ష కోట్ల ఆర్డర్లే లక్ష్యం
  • హెచ్‌ఏఎల్‌ సీఎండీ ఆర్‌ మాధవన్‌

హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): విమానయాన, రక్షణ రంగాలకు హబ్‌గా మారిన హైదరాబాద్‌ మరో ఆవిష్కరణకు వేదికైంది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో అత్యంత ముఖ్య విడిభాగం సెంట్రీ ఫ్యూజ్‌లేజ్‌ను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సహకారంతో నగరానికి చెందిన వీఈఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందించింది. దాదాపు ఐదేండ్లపాటు శ్రమించి రూపొందించిన సెంట్రీ ఫ్యూజ్‌లేజ్‌ తొలి యూనిట్‌ను రావిర్యాలలోని కంపెనీ యూనిట్‌లో సోమవారం హెచ్‌ఏఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ మాధవన్‌కు అప్పగించారు. మొత్తం 1,595 భాగాల సమాహారంగా ఉండే ఈ సెంట్రీ ఫ్యూజ్‌లేజ్‌ను మొత్తం ఐదేండ్లపాటు శ్రమించి రూపొందించారు. మిలటరీ విమానాల నాణ్యతను పరిశీలించే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌(డీజీఏక్యూఏ) అనుమతి ఇవ్వటంతో ఈ విడిభాగాన్ని హెచ్‌ఏఎల్‌కు అప్పగించారు.

విడిభాగాల తయారీ బాధ్యత స్వదేశీ కంపెనీలకే..

ఈ సందర్భంగా హెచ్‌ఏఎల్‌ సీఎండీ ఆర్‌ మాధవన్‌ మాట్లాడుతూ తేజస్‌ యుద్ధవిమాన విడిభాగాల తయారీని ఐదు స్వదేశీ కంపెనీలకు అప్పగించినట్టు తెలిపారు. పూర్తిస్థాయిలో హెచ్‌ఏఎల్‌ పర్యవేక్షణలో వీఈఎం టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ విజయవంతంగా సెంట్రీ ఫ్యూజ్‌లేజ్‌ను రూపొందించిందని వెల్లడించారు. హెచ్‌ఏఎల్‌ రూపొందిస్తున్న తేజస్‌మార్క్‌-2 మీడి యం వెయిట్‌ యుద్ధవిమానం డిజైన్‌ను ఆడా (ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ)తో కలిసి తయారు చేస్తున్నట్టు వివరించారు. అన్నిదశల్లో పనులు పూర్తయి తే 2027నాటికి మార్క్‌-2ను పరీక్షిస్తామని పేర్కొన్నారు. కొవిడ్‌లోనూ హెచ్‌ఏఎల్‌ లాభాల్లో రెండంకెల వృద్ధిరేటు నమోదు చేసిందని, ఏడాదికి రూ.లక్ష కోట్ల ఆర్డర్లే లక్ష్యంగా ఆవిష్కరణలు చేపడుతున్నామని వివరించారు. లైట్‌ యుటిలిటీ హెలికాప్టర్‌, లైట్‌ కాంబోట్‌ హెలికాప్టర్ల డిజైన్‌ తయారీ దశలో ఉన్నట్టు వెల్లడించారు. వీఈఎం టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఎండీ వీ వెంకటరాజు మాట్లాడుతూ ఏడాదికి నాలుగు నుంచి ఆరు సెంట్రీ ఫ్యూజ్‌లేజ్‌లను తయారుచేస్తామని తెలిపారు. హెల్‌ఏఎల్‌, బీడీఎల్‌, డీఆర్‌డీఎల్‌ నుంచి తమకు రూ.800 కోట్ల ఆర్డర్లు ఉన్నాయని, విదేశీ ప్రాజెక్టులు కూడా చేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ లైట్‌ కాంబోట్‌ ఎయిర్‌క్రాప్ట్‌ డివిజన్‌ జీఎం ఈపీ జయదేవ, హెచ్‌ఏఎల్‌-ఏవియానిక్స్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ జే సర్కతేహే తదితరులు పాల్గొన్నారు.

ఏమిటీ సెంట్రీ ఫ్యూజ్‌లేజ్‌!

- Advertisement -

తేజస్‌ యుద్ధ విమానంలోని ముందు, వెనుక భాగాలను కలుపుతూ ఉండే విడిభాగమే సెంట్రీ ఫ్యూజ్‌లేజ్‌. ఇందులోనే విమాన ఇంధనం ఉంటుంది. దీనికి అనుసంధానించి ల్యాండింగ్‌గేర్‌, యుద్ధ విమానం రెక్కలు ఉంటాయి. దీన్ని తక్కువ బరువున్న లోహమిశ్రమాలతో తయారుచేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా విడిభాగాలను తయారుచేస్తున్నారు. దీంతో యుద్ధ విమాన తయారీ ఖర్చు భారీగా తగ్గనున్నది.

విమాన వ్యవస్థలకు కేంద్రంగా తెలంగాణ

భారతదేశ తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ముఖ్య భాగం హైదరాబాద్‌లో రూపుదిద్దుకోవడం రాష్ర్టానికి గర్వకారణం. ఈ ఘనత సాధించిన వీఈఎం టెక్నాలజీస్‌కు నా అభినందనలు. తెలంగాణ విమాన, క్షిపణి వ్యవస్థలకు కేంద్రంగా మారినందుకు ఆనందంగా ఉన్నది.

  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana