e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home తెలంగాణ మన తెలంగాణ రైతన్న అద్భుత ఆవిష్కరణ

మన తెలంగాణ రైతన్న అద్భుత ఆవిష్కరణ

మన తెలంగాణ రైతన్న అద్భుత ఆవిష్కరణ

విటమిన్‌-డి.. ప్రాణికోటికి సూర్యుడు సహజంగా అందించే విటమిన్‌.. కొన్ని ఇతర ఆహార పదార్థాల్లో కూడా లభించే ఈ విటమిన్‌ను ఇప్పుడు చాలామంది మందులుగా వాడే దుస్థితికి చేరుకొన్నారు. కానీ అతి త్వరలోనే మన ప్రధాన ఆహారమైన బియ్యం, గోధుమల్లో కూడా విటమిన్‌-డి సహజంగా లభించనున్నది. తెలంగాణ రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డి సృష్టించిన నూతన వరి, గోధుమ వంగడాలతో ఇది సాకారం కానున్నది. 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): అతనో రైతు.. వ్యవసాయమే ఆయన ప్రాణం.. పేరుకు రైతే అయినా అతనిలో ఓ గొప్ప శాస్త్రవేత్త దాగి ఉన్నారు. చేసే పనిలోనే అద్భుత ప్రయోగాలతో నూతన ఆవిష్కరణలకు జీవం పోశారు. ఈ ప్రయోగాలే అతనికి ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు కూడా ఆయనను వరించింది. ఆయనే హైదరాబాద్‌కు చెందిన రైతు, పద్మశ్రీ పురస్కార గ్రహీతచింతల వెంకట్‌రెడ్డి. ఈ రైతు శాస్త్రవేత్త ఇప్పుడు ప్రపంచం అబ్బురపడే మరో ఆవిష్కరణ చేశారు. ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్తకు సాధ్యంకాని సరికొత్త వంగడాలకు జీవం పోశారు. సూర్యరశ్మిలో లభ్యమయ్యే విటమిన్‌-డిని ఆయన వరి, గోధుమల్లో ఆవిష్కరించారు. ఈ నూతన వంగడాలను తన పొలంలోనే అభివృద్ధి చేశారు. వెంకట్‌రెడ్డి పరిశోధనలపై వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ జర్నల్‌లో గురువారం ఆర్టికల్‌ ప్రచురితమైంది. దాంతో ఆయన ప్రయోగాలకు అంతర్జాతీయ ఆమోదం లభించింది. మరో మూడు నాలుగు నెలల్లో తన పరిశోధనపై ఆయనకు పేటెంట్‌ కూడా లభించనున్నది.

విప్లవాత్మక ఆవిష్కరణ

సాధారణంగా మనకు విటమిన్‌-డి.. సూర్యరశ్మి, లేదా పాలు, గుడ్లు, కూరగాయల, కొన్నిరకాల చేపల నుంచే లభిస్తుందని తెలుసు. కానీ వెంకట్‌రెడ్డి కృషి, కష్టం ఫలితంగా ఇకపై బియ్యం, గోధుమల్లోనూ విటమిన్‌-డి లభించనున్నది. ఇతర  విటమిన్లతో పోల్చితే మార్కెట్లో విటమిన్‌-డి, విటమిన్‌-సికి డిమాండ్‌ ఎక్కువ. మానవ శరీరానికి సహజసిద్ధంగా లభించాల్సిన ఈ విటమిన్లు ఇప్పుడు ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోజూ సహజంగా తీసుకొనే ఆహారంలోనే ఈ విటమిన్లు ఉండేలా ఏదైనా చేయాలనుకున్నారు వెంకట్‌రెడ్డి. ఇందులో భాగంగానే మొదట విటమిన్‌-డి పై ప్రయోగాలు మొదలుపెట్టిన ఆయన.. అందుకోసం ఎక్కువ మంది ఆహారంగా తీసుకొనే బియ్యం, గోధుమలపై దృష్టి సారించారు. అర ఎకరం పొలంలో ఒకవైపు వరి, మరోవైపు గోధుమ సాగును ప్రారంభించారు. ఆ అర ఎకరాన్నే మళ్లీ చిన్నచిన్న భాగాలుగా విభజించి భిన్నమైన  ప్రయోగాలు చేశారు. బియ్యం, గోధుమల్లో విటమిన్‌-డి సమకూరేలా ప్రత్యేక మిశ్రమాన్ని ఉపయోగించారు. ఆ మిశ్రమాన్ని సహజంగా తేలికగా లభించే మూడు పదార్థాలతో తయారు చేశానని వెంకట్‌రెడ్డి తెలిపారు. మిశ్రమం తయారీకి పెద్ద ఖర్చు కూడా ఉండదని.. ఒక ఎకరాకు సరిపోయే మిశ్రమం తయారీకి సుమారు రూ. 2-3వేలు మాత్రమే అవుతుందని చెప్పారు. ఆ మిశ్రమాన్ని నీటిలో కలిపి రెయిన్‌ డ్రిప్‌ విధానంలో పొలానికి పారించారు. నీటిని తక్కువగా వాడేందుకు పొలం మధ్యలో స్టాండ్లపై పైపులను ఏర్పాటు చేసి నీటిని వర్షంలా వెదజల్లేలా చేశారు. ఈ విధానంలో సాగు చేసిన వరికి ఎలాంటి చీడ పీడలు కూడా సోకకపోవడం మరో ప్రత్యేకత. ఈ పంటకు ఆయన ఏ దశలోనూ రసాయన ఎరువులను, క్రిమి సంహారక మందులను ఉపయోగించలేదు.  మొత్తం సేంద్రియ విధానంలోనే చేశారు. 

ఎట్టకేలకు ఫలితం… 

కొత్త వంగడాల కోసం సంవత్సరం పాటు వరి, గోధుమపై వెంకట్‌రెడ్డి ప్రయోగాలు చేశారు. ఆయన కష్టం ఫలించి ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఆ వరి ధాన్యం, గోధుమల్లో విటమిన్‌-డి ఉన్నట్టు తేలింది. పండిన ధాన్యం, గోధులమను పిండి చేసి ల్యాబ్‌లో పరీక్ష చేయించారు. పలుసార్లు భిన్నమైన ల్యాబుల్లో పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. బియ్యం, గోధుమల్లో విటమిన్‌-డి పుష్కలంగా ఉన్నట్టు తేలింది. వరికి సంబంధించి యాసంగిలో 100 గ్రాముల బియ్యంలో 140 ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌ (ఐయూ-విటమిన్లను కొలిసే ప్రమాణం) విటమిన్‌-డి ఉన్నట్టు వెల్లడైంది. వానాకాలం పంటలో 104 ఐయూ ఉన్నట్టు గుర్తించారు. ఐయూ తక్కువ రావడంతో ఆయన మళ్లీ పంటపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాంతో గత వానాకాలంలో పండించిన వరిలో 311 ఐయూ రావడం విశేషం. ఇక గోధుమ విషయానికొస్తే 100 గ్రాముల గోధుమ పిండిలో.. ఒకసారి పంటలో 1,606 ఐయూ, మరో పంటలో 1,830 ఐయూ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. 

అంతర్జాతీయ గుర్తింపు 

వరి, గోధుమల్లో విటమిన్‌-డిని గుర్తించిన వెంటనే ఇండియన్‌ పేటెంట్‌ రైట్స్‌కు వెంకట్‌రెడ్డి దరఖాస్తు చేసుకొన్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ అనుమతి కోసం జెనీవాలో ఉన్న వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌కు కూడా దరఖాస్తు చేశారు. వెంకట్‌రెడ్డి దరఖాస్తుకు ఆ సంస్థ ఆమోదం తెలిపడం గమనార్హం. ఒకవేళ ఇలాంటి ప్రయోగం, వంగడాలు గతంలో ప్రపంచంలో ఎవరైనా అభివృద్ధి చేసి ఉంటే వెంకట్‌రెడ్డి దరఖాస్తును స్వీకరించేవారు కాదు. వెంకట్‌రెడ్డిని నూతన ఆవిష్కరణ కావటంతో దాన్ని గుర్తిస్తూ సంస్థ జర్నల్‌లో పరిశోధన వివరాలను ప్రచురించింది (ప్రచురణ నెంబర్‌ WO 2021/024 143). అంతర్జాతీయంగా వెంకట్‌రెడ్డి ప్రయోగాలకు ఆ మోదం లభించటంతో ఇక ఆయనకు ఇండియన్‌ పేటెంట్‌ రైట్స్‌ నుంచి మరో మూడునాలుగు నెలల్లో పేటెంట్‌ దక్కనున్నది.  

ఆ గోధుమలతో మళ్లీ సాగు..

విటమిన్‌-డి ఉన్నట్టు నిర్ధారణ అయిన గోధుమలతో వెంకట్‌రెడ్డి మళ్లీ సాగు చేస్తున్నారు. ఈసారి ప్రత్యేక మిశ్రమాన్ని ఉపయోగించి కొంత.. ఉపయోగించకుండా మరికొంత పొలాన్ని వేశారు. మిశ్రమాన్ని ఉపయోగించని పొలంలో పండిన గోధుమల్లో విటమిన్‌-డి ఉన్నట్టు తేలితే.. అది మరో వంగడ విప్లవానికి నాంది అవుతుం ది. అంటే విటమిన్‌-డి గల విత్తనం ఎలా ంటి మిశ్రమాన్ని వాడకుండానే విటమిన్‌-డి గల గోధుమలను పండిస్తుందన్నమాట. 

తొలి ప్రాధాన్యం తెలంగాణకే

విటమిన్‌-డి గల నూతన వరి, గోధుమ వంగడాలపై పేటెంట్‌ హక్కు రాగానే వీటి సాగుకోసం తెలంగాణ ప్రభుత్వంతోనే   తొలి ఒప్పందం చేసుకొంటానని వెంకట్‌రెడ్డి తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకురాకపోతే  ప్రైవేటు భాగస్వాములు, ఇతర రాష్ర్టాలతో ఒప్పందాలు   చేసుకొంటానని చెప్పారు. మన రైతులకు మేలు జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.  

మూడు వరి రకాల్లో కొత్త వంగడం 

వరికి సంబంధించి భారీ డిమాండ్‌ ఉన్న సాంబమసూరి, బాస్మతి, కావేరీ చింటు అనే మూడు రకాల వంగడాలపై వెంకట్‌రెడ్డి ప్రయోగాలను నిర్వహించారు. బాస్మతి బియ్యంలో విటమిన్‌-డి 311 ఐయూ రాగా సాంబమసూరి, కావేరి చింటులో 287 ఐయూ వచ్చింది. వీటి పంట కాలం, సాగు విధానంలోనూ పెద్దగా తేడాలేమీ లేవు. సాధారణ వరి పంటను సాగుచేసినట్టుగానే దీనినీ సాగుచేశారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మన తెలంగాణ రైతన్న అద్భుత ఆవిష్కరణ

ట్రెండింగ్‌

Advertisement