e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home Top Slides థింక్‌ పాజిటివ్‌

థింక్‌ పాజిటివ్‌

థింక్‌ పాజిటివ్‌
 • భయం వీడితేనే కరోనాపై విజయం
 • ఫ్యామిలీ తోడ్పాటుతోనే ప్రశాంతత
 • ఆశావహమే ఆయువుపెంచే ఔషధం
 • ఆత్మీయత ఒత్తిడిని గెలిచే ఆయుధం
 • అనర్థాలకు దారితీస్తున్న అతిభయం
 • నిరాశ, నిస్పృహలతో డిప్రెషన్‌లోకి

ప్రతి ఒక్కరిలో తెలియని అభద్రతాభావం. అంతులేని భయం. ప్రతి చూపులో అనుమానపు నీడ.. ప్రతి చేతలోనూ సందేహపు జాడ. మదిమదిలో ఎడతెగని సంఘర్షణ. పదపదే అవే ఆలోచనలు..

కరోనా.. కరోనా.. కరోనా.. అవే చర్చలు. వెరసి కుటుంబమంతా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నది. ఇది మనిషి రోగనిరోధక శక్తిని కూడా బలహీనం చేస్తున్నది. అదే.. ఆ భయాన్ని వీడితేనే జీవితం ఆనందమయం. నిరాశ, నిస్పృహను జయిస్తేనే భవిష్యత్‌పై ఆశ చిగురుస్తుంది. ఇందుకు సానుకూల ఆశావహమే అసలైన ఔషధం. కుటుంబంలో ఆత్మీయతే ఒత్తిడిని జయించే ఆయుధం. పాజిటివ్‌ థింకింగ్‌తోనే క‘రోనా’ నుంచి విముక్తి.
హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారితో కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. కొవిడ్‌ సుడిగాలి సమాజాన్ని ఊపిరి సలపనివ్వడం లేదు. వార్తాచానళ్లు.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా గుండెలను మెలిపెట్టే దీనగాథలే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనేదాకా కన్నీటి దృశ్యాలే. ఆరని చితిమంటలు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు. నిత్యం ఇలాంటి దృశ్యాలే చూస్తూ.. ఇలాంటి వార్తలే వింటూ ప్రతి ఒక్కరూ నిరాశ, నిస్పృహలో కూరుకుపోతున్నారు. అనవసర ఆందోళనలకు గురవుతున్నారు. అభద్రతా భావానికి, అంతులేని భయానికి లోనవుతున్నారు. ‘లోకల్‌ సర్కిల్స్‌’ సంస్థ ‘సెకండ్‌వేవ్‌- మానసిక స్థితి’ అనే అంశంపై దేశవ్యాప్తంగా 8,141 మందిని ఈ సంస్థ సర్వే చేయగా.. 61% మందిలో డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తున్నట్టు తేలింది. 28% మంది ‘త్వరలో మంచి జరుగుతుంది’ అనే ఆశతో ఉన్నామని చెప్పగా.. 11% మంది మాత్రమే ప్రశాంతంగా ఉన్నట్టు వెల్లడించారు. దీన్నిబట్టి సమాజం ఎంతటి మానసిక క్షోభలో కూరుకుపోయిందో అర్థమవుతున్నది. మరి కుటుంబాన్ని ఆవహించిన భయాన్ని తొలగించేదెలా? విపత్తుకు ఎదురొడ్డి నిలబడేదెలా? అన్నవే ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్నలు.

కుటుంబ తోడ్పాటు కీలకం

వ్యక్తి సామాజిక జీవనానికి పునాది కుటుంబం. సభ్యులందరూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ.. అనవసర భయాలు, ఆందోళనలను దూరం చేసుకోవాలి. ఆందోళనకు గురవుతున్నవారిని ఆప్యాయంగా పలుకరిస్తూ వారిలో దానిని పోగొట్టాలి. కుటుంబంలో సమస్యలకు ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులు. కరోనా కారణంగా అవి మరింతగా పెరిగిన నేపథ్యంలో సభ్యులందరూ కలిసి ఆదాయవనరులను బట్టి ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. రాబడికి తగిన విధంగా ఖర్చులు పెట్టుకోవాలి. అందుకోసం అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. దంపతులు పరస్పరం అర్థం చేసుకోవాలి. ఒకరిపై ఒకరు పూర్తి విశ్వాసం ప్రకటించాలి. అవగాహనతో ముందుకుసాగాలి. పట్టువిడుపులను ప్రదర్శించాలి. పిల్లల ముందు ఎప్పుడూ వాగ్వాదానికి దిగవద్దు. లేదంటే దాని ప్రభావం చిన్నారులపై పడుతుంది. ఏ విషయాన్నైనా నిదానంగా కూర్చుని చర్చించుకుంటే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి కలిసి కూర్చుని భోజనం చేయడం మనసుకు ఎంతో తృప్తినిస్తుంది. ఇంటి పనిని భాగా-లుగా విభజించుకుని అందరూ పాలుపంచుకోవాలి. తద్వారా అనవసర విషయాలపైకి ఆలోచనలు వెళ్లకుండా ఉండటంతోపాటు, ఒక్కరిపైనే శ్రమ పడకుండా ఉంటుంది. వినోద భరిత సినిమాలు, మెలోడీ పాటలు మనస్సులో ఉన్న భయాలను పారదోలుతాయి.

చిన్నారుల చింత తీర్చాలి

పాఠశాలల మూత, స్నేహితులను కలిసే అవకాశం లేకపోవడం, ఆటలకు దూరం కావడం చిన్నారులను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నది. సమ వయస్కులతో (పీర్‌ గ్రూప్‌)తో కలిసే అవకాశం లేక ఇంటిని చెరసాలగా భావిస్తున్న చిన్నారులు ఆవేశం, కోపాన్ని బయటకు వెళ్లగక్కలేక లోలోపల కుమిలిపోతున్నారు. ఒక్కోసారి తల్లిదండ్రులతో ఘర్షణలకూ దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలతో ఎక్కువగా గడిపేలా తల్లిదండ్రులు ప్రణాళికలు రూపొందించుకోవాలి.

 • చిన్నారులతో వీలైనంతగా ఎక్కువ సమయం గడపాలి.
 • ఇంట్లో చిన్నచిన్న పనులు చేసేలా చూడాలి. ఇది శారీరక దృఢత్వానికి కూడా దోహదపడుతుంది.
 • పెయింటిగ్స్‌, పేపర్‌ క్రాఫ్ట్‌ పిల్లలను తయారుచేసేలా ప్రోత్సహించాలి.
 • చెస్‌, క్యారమ్స్‌ తదితర ఇండోర్‌ గేమ్స్‌ నేర్పించాలి.
 • ప్రతి రెండు గంటలకు ఒకసారి పుష్టికరమైన ఆహారాన్ని అందించాలి.
 • నిర్ణీత సమయం అంటే ఆన్‌లైన్‌ పాఠాలను వినేంత వరకే స్మార్ట్‌ ఫోన్లను, టీవీని చూసేందుకు అవకాశమివ్వాలి. తర్వాత ఫోన్‌డాటా, నెట్‌ను ఆఫ్‌ చేయాలి. అవసరమైన ఆటోమెటిక్‌ లాక్‌ యాప్‌లను వినియోగించవచ్చు.
 • పిల్లలు నెట్‌ను దేనికి ఉపయోగిస్తున్నారు? ఏం చూస్తున్నారు? తదితర అంశాలపై దృష్టిసారించాలి. ఇందుకోసం నెట్‌నానీ, జస్టిఫై, టీన్‌ యాంగిల్స్‌, షెడ్యూల్‌ లాంగర్‌, స్పెక్టర్‌ సాఫ్ట్‌ వంటి ఎన్నో చైల్డ్‌ మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి.
 • పిల్లలు ఒత్తిడి, అసహనానికి గురవుతున్నా, కోపం, చిరాకు ప్రదర్శిస్తున్నా వారికి కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. అదీకూడా ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే.
థింక్‌ పాజిటివ్‌

కుటుంబసభ్యులు ఆచరించాల్సినవి

 • సోషల్‌ మీడియా, టీవీల్లో నిరాశ, ఆందోళనకు గురిచేసే వార్తలు, అంశాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సానుకూల చింతనను అలవర్చుకోవాలి. మంచే జరుగుతుందనే పాజిటివ్‌ థింకింగ్‌తో భయం తొలిగి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
 • యోగా, ప్రార్థనవంటివి మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయి. సానుకూల, ఆశావహ ఆలోచనా దృక్పథాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా సమిష్టిగా వ్యాయామాలు, పుస్తక పఠనంతో ఎంతో మేలు కలుగుతుంది.
 • ఎంత పెద్ద సమస్యనైనా ఇతరులతో పంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో తరుచూ మాట్లాడుతూ ఉండాలి. దీంతో చాలావరకు ఒత్తిడి తొలుగుతుంది.
 • అప్పటికీ ఒత్తిడిని నియంత్రించుకోవడం సాధ్యం కాకపోతే అంతర్లీనంగా ఉన్న నిరాశ, నిస్పృహలను గుర్తించి మానసిక నిపుణులను సంప్రదించాలి. తరచూ కౌన్సిలింగ్‌ ద్వారా కూడా చికిత్స పొందవచ్చు.

వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వద్దు

కరోనా విపత్తుతో వృద్ధులు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న శారీరకపరమైన ఆరోగ్య సమస్యలకుతోడు కరోనా వారిని మరింత కుంగదీస్తున్నది. ఈ సమయంలో వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా వారితో తరచూ మాట్లాడుతూ యోగక్షేమాలను విచారిస్తుండాలి. అది వారికి ఎంతో మనోనిబ్బరాన్నిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు సకాలంలో మందులు అందించాలి. కరోనా పరిస్థితులు సద్దుమణిగేంత వరకూ టెలి మెడిసిన్‌, కన్సల్టెన్సీ ద్వారా వైద్యపరీక్షలు చేయించాలి. త్వరగా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలి.

ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపాలి

కరోనాతో చాలా కుటుంబాల్లో అశాంతి పె రిగిపోతున్నది. ప్రతి ఒక్కరినీ భయం ఆవహిస్తున్నది. ఇది మరింత ప్రమాదకరం. వీలైనం త వరకు సోషల్‌ మీడియాకు, విచారకర సం ఘటనలకు దూరంగా ఉండాలి. అత్యవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. మేం ఉచితంగానే సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ సంస్థలు, వైద్యశాలలు, కార్యాలయాలల్లో మానసిక నిపుణులు, కౌన్సిలర్లను నియమించి మానసిక ైస్థెర్యం నింపేందుకు కృషి చేయాల్సిన అవసరమున్నది.
-పద్మజా కమలాకర్‌, ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌, ఫ్యామిలీ అండ్‌ మ్యారేజ్‌ కౌన్సిలర్‌

బాల్యం నుంచే అవగాహన పెంచుకోవాలి

కరోనా భయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్నారులను మాతృస్పర్శకు దూరం చేయవద్దు. అది వారిలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో కరోనా బాధితులు లేకున్నా శానిటైజేషన్‌ చేస్తూ ఉండాలి. పరిశుభ్రత పాటించాలి. తద్వారా చిన్నారులు ఎలాంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండదు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లకు వారిని దూరం పెట్టాలి.
-పీ కృష్ణ ప్రసాద్‌,పీడియాట్రిషన్‌, హైదరాబాద్‌

దంపతులు పరస్పర విశ్వాసంతో వ్యవహరించాలి

కుటుంబ వ్యవస్థకు మూలం దాంపత్యం. కాబట్టి దంపతులు పరస్పరం విశ్వాసంతో మెదలాలి. పిల్లలకు ఆదర్శంగా, ప్రేరణగా నిలవాలి. స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి. సమిష్టిగా పనులు చేయడం వల్ల అనుబంధాలు పెరుగుతాయి. దీంతో దాంపత్య బంధం, తద్వారా కుటుంబ బంధాలు పెరుగుతాయి.
-జీ గణేశ్‌, సైకాలజిస్ట్‌, వరంగల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
థింక్‌ పాజిటివ్‌

ట్రెండింగ్‌

Advertisement