e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home Top Slides జోగులాంబకు సర్వే

జోగులాంబకు సర్వే

జోగులాంబకు సర్వే
  • కృష్ణా నదిపై మొత్తం ఆరు నూతన ప్రాజెక్టులు
  • సర్వేకు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని వెల్లడి


హైదరాబాద్‌, జూన్‌ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిని తరలించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. ఇటీవల క్యాబినెట్‌లో ఆమోదించిన జోగులాంబ బరాజ్‌ సహా నూతనంగా ఆరు ప్రాజెక్టుల సర్వేకు అనుమతులు ఇస్తూ గురువారం నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణాబేసిన్‌లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను తరలించేందుకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించనున్నట్టు వెల్లడించారు.

జలదోపిడీపై పోరు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదిపై చట్టవిరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా పనులు కొనసాగిస్తూ భారీగా నీటిని తరలించేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతున్నది. ఈ జలదోపిడీని అడ్డుకోవాలని క్యాబినెట్‌ ఇటీవల నిర్ణయించింది. ఓవైపు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై పోరాడుతూనే.. మరోవైపు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానంగా జోగులాంబ బరాజ్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ తాజాగా సర్వేకు అనుమతులు ఇచ్చింది.

సర్వే చేయనున్న ప్రాజెక్టులు

  • జోగులాంబ బరాజ్‌: శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువన తుంగభద్ర నది కృష్ణాలో కలువడానికి ముందు బరాజ్‌ నిర్మించనున్నారు. ఇక్కడ 35-40 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు.
  • భీమా వరద కాలువ: నారాయణపేట జిల్లాలోని కసుమర్తి వద్ద భీమా నది కృష్ణా నదిలో కలిసే చోట వరద మళ్లింపు కాలువను నిర్మించనున్నారు. వరదల సమయంలో దీని ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించనున్నారు. ఈ కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు పరిధిలోని గోపాలదిన్నె రిజర్వాయర్‌ వరకు ఉన్న రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపనున్నారు.
  • సుంకేశుల బరాజ్‌కు ఎగువన ఎత్తిపోతల నిర్మించి, గద్వాల, ఆలంపూర్‌ ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల ఎకరాలకు నీటిని మళ్లించనున్నారు. తద్వారా ఆర్డీఎస్‌, నెట్టెంపాడు లిఫ్ట్‌ పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందనున్నది.
  • కల్వకుర్తి లిఫ్ట్‌ పరిధిలో అదనంగా సుమారు 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా కొత్త రిజర్వాయర్లు నిర్మిచనున్నారు.
  • నల్లగొండ జిల్లాతోపాటు నాగార్జునసాగర్‌ ఎడమకాలువ పరిధిలో సాగునీరు అందని మెట్టప్రాంతాలకు నీటిని మళ్లించేందుకు పులిచింతల డ్యామ్‌ ఎగువన ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు. సుమారు 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందిస్తారు.
  • నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ పరిధిలో ఒక ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నాగార్జునసాగర్‌ కింద సాగునీరు అందని సుమారు లక్ష ఎకరాల చివరి ఆయకట్టు, మెట్ట ప్రాంతాలకు నీటిని మళ్లించనున్నారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జోగులాంబకు సర్వే
జోగులాంబకు సర్వే
జోగులాంబకు సర్వే

ట్రెండింగ్‌

Advertisement