e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home టాప్ స్టోరీస్ గులాబీవైపే.. హుజూరాబాద్‌ దండు

గులాబీవైపే.. హుజూరాబాద్‌ దండు

గులాబీవైపే.. హుజూరాబాద్‌ దండు
  • కేసీఆర్‌బాటలోనే సాగుతామంటున్న కమలాపూర్‌కు చెందిన 8 మంది ఎంపీటీసీలు
  • టీఆర్‌ఎస్‌ వెంటే నడిచేందుకు కదులుతున్న శ్రేణులు
  • సొంత గ్రామంపై పట్టులేని మాజీమంత్రి.. 3 ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటి మాత్రమే గెలుపు

కరీంనగర్‌, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆది నుంచీ ఉద్యమానికి, జెండాకు అండగా నిలిచిన హుజూరాబాద్‌ నియోజకవర్గ గులాబీ దండు ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తున్నది. వ్యక్తి కాదు, పార్టీనే ముఖ్యమంటూ ముక్త కంఠంతో చెబుతున్నది. సాధారణ కార్యకర్త నుంచి ప్రథమ శ్రేణి నాయకుడి వరకు.. కేసీఆర్‌ బాటలోనే నడిచేందుకు ముందుకొస్తున్నారు. ప్రజలు ఇదే ధోరణిలో ఉండగా, బుధవారం అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో ఉండగానే ఆయన సొంత మండలం కమలాపూర్‌ నుంచి 8 మంది ఎంపీటీసీలు కేసీఆర్‌ బాటలో నడుస్తామని ప్రకటించారు. పదవుల కోసం పెదవులు మూసుకోనని, ఆత్మగౌరవం ముందు పదవులు లెక్కకాదని స్వయంగా చెప్పిన ఈటల.. ఇప్పుడు అదే పదవుల కోసం ఎందుకు పాకులాడుతున్నాడన్న ప్రశ్నలను హుజూరాబాద్‌ నియోజకవర్గ శ్రేణులే సంధిస్తున్నాయి.

పార్టీ వెంటే మేముంటాం..

ఈటల వ్యవహార శైలి, బయట పడుతున్న అక్రమాలు, ఆత్మగౌరవం పేరుతో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల గడపలు తొక్కడం, బర్తరఫ్‌ అయినా పదవిని వీడకుండా పాకులాడడం, పదవిలో ఉండగా కన్నెత్తి చూడని నాయకులను ఇప్పుడు పిలిపించుకొని మాట్లాడడం.. వంటి అనేక పరిణామాలపై నియోజకవర్గ ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో లోతైన చర్చ జరుగుతున్నది. ఈటల అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్న నేపథ్యంలో ప్రజలు, పార్టీ శ్రేణులు వాస్తవాలను గుర్తిస్తున్నారు. పదిహేనేళ్లుగా వివిధ హోదాల్లో ఉన్న రాజేందర్‌ తాను ఎదిగిన మాదిరిగా నియోజకవర్గాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదన్న చర్చ ప్రస్తుతం ప్రతి నోటా, ఇంటా జరుగుతున్నది. ఈటల స్థానంలో కేసీఆర్‌ ఎవరిని నిలబెట్టిన గెలిపించే వారమని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఎవరిని కదలించినా.. ఓటు వేసింది ఈటలకు కాదు.. కేసీఆర్‌కు అంటున్నారు.

ఏదీ ఆత్మగౌరవం

మాట మాటకు ఆత్మగౌరవానికి కట్టుబడి ఉంటానని చెప్తున్న ఈటల.. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. పదవులపై మోజు లేకపోతే రాజీనామాచేసి ప్రజాక్షేత్రంలో తెల్చుకోవచ్చు కదా అని పార్టీ శ్రేణులే సవాలు విసిరుతున్నాయి. ఇన్నాళ్లు గులాబీ జెండా కింద కోట్లకు పడగలెత్తి.. అక్రమాలు బయటపడగానే పక్క పార్టీల వైపు పరుగులెత్తడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటలను చూసి కాదు.. గులాబీ జెండాను చూసి ఓటువేసిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజేందర్‌ సొంత గ్రామం కమలాపూర్‌లో మూడు ఎంపీటీసీ స్థానాలకు 2020లో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నిలుచుంటే కేవలం ఒక స్థానాన్ని ఈటల దక్కించుకోగా.. ఒకటి కాంగ్రెస్‌ మరోటి స్వతంత్య్ర అభ్యర్థి సాధించారు. 17 ఏండ్లుగా రాజకీయాల్లో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తి సొంత గ్రామంలో ఎవరిని పెట్టినా ప్రజలు గెలిపించాలి. కానీ, ఆయన సొంత గ్రామంలోనే ఆయనకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.

కట్టుదాటని కమలాపూర్‌

స్వగ్రామమేకాదు, కమలాపూర్‌ మండలంలోనూ ఈటలకు పట్టులేదని చెప్పడానికి బుధవారం జరిగిన పరిణామాలను ఉదాహరణగా చెప్పవచ్చు. రాజేందర్‌ హుజూరాబాద్‌ పర్యటనలో ఉండగానే.. కమలాపూర్‌ మండలానికి చెందిన 8 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు కేసీఆర్‌ బాటలోనే కొనసాగుతామని ప్రకటించారు. వీరిలో కమలాపూర్‌ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, తూర్పాటి అరుణ క్రాంతికుమార్‌, గుర్రం వెంకటేశ్వర్లు, గుబిరె సుగుణకార్‌రావు, పసరగొండ శైలజ నాగేందర్‌, ఇంజంపల్లి రామస్వామి, అరకుల లింగారెడ్డి, బండయాదగిరి ఉన్నారు. టీఆర్‌ఎస్‌ బీ ఫారంపై గెలిచిన తాము ఈటల వెంట ఉండమని, పార్టీతోనే ఉంటామని స్పష్టంచేశారు. ఈ పరిణామాలు రాజేందర్‌కు షాక్‌ నివ్వగా.. ఎంపీటీసీలు తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. కాగా.. జమ్మికుంట బుధవారం రాత్రి తెరాసకు మద్దతుగా మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, సింగిల్‌ విండో చైర్మన్లు మంత్రి గంగులను కలిశారు. జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావుతోపాటు 14 మంది కౌన్సిలర్లు, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ పొల్సాని తిరుపతిరావుతో 9మంది ఎంపీటీసీలు, జమ్మికుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది సర్పంచులు, ముగ్గురు సింగిల్‌ విండో చైర్మన్లు టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గులాబీవైపే.. హుజూరాబాద్‌ దండు

ట్రెండింగ్‌

Advertisement