హైదరాబాద్: టోపీలు ధరించిన వారంతా హీరోలు కాలేరు.. అలాగే కరోనా మహమ్మారి ప్రభావంతో లక్షల మంది వలస కార్మికులకు అండగా నిలిచిన బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కూడా ప్రతి చోటికి వెళ్లలేరు..
అటువంటి వారి కోసం హైదరాబాదీలు అండగా నిలిచారు.. తద్వారా భాగ్య నగర ప్రజలు స్ఫూర్తికి మారుపేరుగా ఉన్నారు.
హైదరాబాద్‌లోని తలాబ్‌కట్ట వాసి మహమ్మద్ అఖీల్.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ జెయింట్ జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.
ఐటీకే తలమానికంగా నిలిచిన హైదరాబాద్‌లో ఏదైనా డెలివరీ చేయాలంటే మోటార్ బైక్ లేదా స్కూటీ కావాలి.. కానీ మహమ్మద్ అకీల్ హీరో సైకిల్‌పై ఫుడ్ ప్యాకెట్లు డెలివరీ చేస్తున్నాడు..
వర్షం కురుస్తున్నా.. సూర్య భగవానుడు భగభగమంటూ మండుతున్నా సైకిల్ తొక్కుకుంటూ ఫుడ్ ప్యాకెట్లు డెలివరీ చేయాల్సిన దయనీయ జీవితం అకీల్ది.. అదేంటో చూద్దామా..
21 ఏండ్ల ఈ ఇంజినీరింగ్ విద్యార్థి కుటుంబం రెక్కాడితే గానీ డొక్కాడని పేదరికంలో మగ్గుతున్నది. మంచి వేతనం ఇచ్చే ఉద్యోగం సంపాదించుకుని కుటుంబానికి అండగా ఉండాలని కలలు కన్నాడు.. కానీ కరోనా మహమ్మారి ఆ కలలను చిధ్రం చేసింది.
కేవలం అకీల్ తండ్రి స్లిప్పర్ల తయారీపైనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా వల్ల ఆ పని కూడా నిలిచిపోవడంతో కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్‌గా మారాడు అకీల్.
అందుకోసం జోమాటోతో కనెక్ట్ అయ్యాడు. కానీ బైక్ సంగతేమో కానీ సైకిల్ కొనాలంటే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఈ కుటుంబానిది.
అయినా మొక్కవోని దీక్షతో హీరో సైకిల్ పైనే రోజూ 20 ఫుడ్ ప్యాకెట్లు డెలివరీ చేస్తున్నాడు. కనీసం 80 కిలోమీటర్లు సైకిల్‌పైనే ప్రయాణిస్తున్నాడు.
నెలకు రూ.8000 ఆదాయం సంపాదిస్తున్నాడు. కానీ తనకు వచ్చే ఆర్డర్లపైనే ఈ ఆదాయం ఆధార పడి ఉందని వాపోయాడు.
దయార్థ హృదయానికి మారుపేరుగా నిలిచిన హైదరాబాదీల కరుణ అకీల్ పనిని ఇప్పుడు తేలిక చేసింది. అకీల్ కష్టాలను స్వయంగా చూసిన రూబిన్ ముకేశ్ అనే వ్యక్తి చలించిపోయాడు.
వెంటనే అకీల్‌కు బైక్ కొనిచ్చేందుకు అవసరమైన మనీ సేకరణకు క్యాంపెయిన్ చేపట్టాడు.‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్’ అనే ఫేస్బుక్ ఖాతాలో ఈ పోస్ట్ చేశాడు. ఈ గ్రూప్‌లో 32 వేల మంది సభ్యులు ఉన్నారు.
అకీల్‌కు టీవీఎస్ ఎక్స్ఎల్ 100 బైక్ అవసరం.. ఆ బైక్ కొనాలంటే రూ.65,801 అవసరం .. కానీ కేవలం 24 గంటల్లోపే రూ.73,370 జమ అయ్యాయి.
ఈ పరిణామంపై రూబిన్ ముఖేశ్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది హైదరాబాదీల మానవత్వానికి నిజమైన నిదర్శనం. అకీల్ కష్టాలను కడతేర్చేందుకు నా క్రుషి ఫలించినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నాడు.
ప్రస్తుతం మహమ్మద్ అకీల్ ఒక మోటార్ బైక్, హెల్మెట్, ఒక రెయిన్ కోట్ కూడా కలిగి ఉన్నాడు. హైదరాబాదీల మానవత్వంతో కదిలిపోయిన అకీల్ ఆనంద భాష్పాలు రాల్చాడు.
ప్రతి రోజూ కనీసం 30 ఆర్డర్లు అందుకుంటూ సకాలంలో డెలివరీ చేస్తూ కుటుంబానికి ఫీడ్ అందించగలుగుతున్నాడు.