నీలి చిత్రాలు చూశావు... ఐదు లక్షలు కట్టు...

Mon,August 13, 2018 08:42 AM

You surf internet porn. Fine. But do you know how to avoid the hackers

హైదరాబాద్ : మీరు నీలిచిత్రాల వెబ్‌సైట్లు బ్రౌజ్ చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్తా.. అది చూస్తే మీరు లక్షలు వదులు కోవాల్సిందే. లేదంటే మీ నీలి చిత్రాల బ్రౌజింగ్ ప్రపంచానికి తెలిసిపోతున్నది. ఇదేంటి రహస్యంగా చూసినా మమ్మల్ని ఎవరు గమనిస్తున్నారని సందేహపడుతున్నారా.. లేదా ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారా.. అయితే మీరు చిక్కినట్లేనని ఇప్పుడు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. అవును.. నిజం అశ్లీల వెబ్‌సైట్‌లను చూసే ప్రియులను ఇప్పుడు సైబర్ మాయగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. మీరు బ్రౌజ్ చేస్తున్న వెబ్‌సైట్ల నుంచి మీ సమాచారాన్ని మాల్‌వేర్స్ ద్వారా సేకరిస్తున్నారు. దీంతో మీ మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, ఇతర సమాచారాన్ని సేకరించి వాటి ద్వారా మిమ్మల్ని బెదిరించి మీ నీలిచిత్రాల వీక్షణాన్ని మీకే చూపించి డబ్బులు వసూలు చేసేందుకు సరికొత్త ఎక్స్‌టార్షన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌లకు చెందిన కొంత మంది యువకులు ఈ విధమైన బెదిరింపులు ఎదుర్కొని ఇబ్బందులుపడ్డారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆ యువకులు పోలీసులను ఆశ్రయించి తమ బాధను వ్యక్తం చేశారు.

నీలి చిత్రాలు చూశావు ఐదు లక్షలు కట్టు..


రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి ఎల్బీనగర్ డీసీపీ జోన్ ప్రాంతానికి చెందిన సుధాకర్(పేరుమార్చాం)కు ఇటీవల ఓ మెయిల్ వచ్చింది. నీవు ఈ మధ్య ప్రతిరోజు నీలిచిత్రాల వెబ్‌సైట్లను బాగానే జల్లెడ పడుతున్నావు. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా చూస్తున్నావు, అందులో ప్రత్యేకంగా ఓ వయసు గల మహిళలపైనే వ్యామోహం పెంచుకున్నావ్. ఏంటి సంగతని అందులో వివరించారు. ఇది చదువుతున్న సుధాకర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. మిగతా మెయిల్ చదివి ఇది ఎవరో ఆటపట్టించడానికి చేసి ఉంటారని భావించి తేలికగా తీసిపాడేశాడు. మరో రోజు సుధాకర్‌కు నిజంగా అతను బ్రౌజ్ చేసిన కొన్ని వెబ్‌సైట్లలోని ఫొటోలు మెయిల్‌కు వచ్చాయి. దీంతో మరింతగా కలవరపడ్డాడు. ఏమి అర్థంకాలేదు.. టెన్షన్ పడ్డాడు. మరో రెండురోజుల తర్వాత మరో మెయిల్ వచ్చింది. నీవు మాకు రూ.ఐదు లక్షలు బిట్‌కాయిన్స్ (క్రిప్టో కరెన్సీ) కింద జమ చేయాలి. లేదంటే ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఉన్న నీ ప్రతిష్టను దెబ్బతీస్తామని హెచ్చరించారు. నీవు బ్రౌజ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాతోపాటు నీ మెయిల్ కాంటాక్ట్స్‌లో ఉన్న స్నేహితులందరికి పంపిస్తామని హెచ్చరించారు. ఈమెయిల్‌తో మరింత ఆందోళనకు గురైన సుధాకర్ వెంటనే రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి మౌఖికంగా ఈ మెయిల్ తతంగంపై వివరించారు. పోలీసులు ఇలాంటి వారికి భయపడి డబ్బులు కట్టొద్దని సూచించారు. ఇలాంటి వెబ్‌సైట్లకు దూరంగా ఉంటేనే సురక్షితమని చెప్పారు.

మిమ్మల్ని ఎలా చూస్తారంటే...


నీలిచిత్రాల వెబ్‌సైట్లను వీక్షించేందుకు చాలా మంది గూగుల్ సెర్చ్‌లో గాలిస్తారు. ఈ బ్రౌజింగ్‌తో పలు అశ్లీల వెబ్‌సైట్ల ఆచూకీలు తెలుస్తాయి. వీటిలో వెబ్‌సైట్లు వ్యక్తిగత వివరాలు, వయసు, ఫోన్ నంబరు, మెయిల్ ఐడీలను అడుగుతాయి. ఆ సమయంలో వివరాలతో లాగిన్ అవుతారు. ఈ వివరాలు వెల్లడించగానే మన వివరాలు హ్యాకర్‌ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. మరి కొన్ని సందర్భాల్లో ఈ వెబ్‌సైట్‌లలో వీడియోలు, ఫొటోలు వీక్షించే సమయంలో కొత్తకొత్త లింక్ ప్రత్యక్షమవుతాయి. వాటిని క్లిక్ చేసిన క్రమంలో మాల్‌వేర్స్(వైరస్)ను సైబర్ ఛీటర్లు మన కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు పంపిస్తారు. దీంతో ఇక మన పరికరాలు అతని కన్నుసన్నులోకి వెళ్లిపోతాయి. మాల్స్‌వేర్ సోకిన ఆ స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో మనం చేసే ప్రతి బ్రౌజ్ వారికి తెలిసిపోవడంతో మన వ్యక్తిగత వివరాలు పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వారికి లభించే ప్రతి అంశాన్ని మన వీక్‌నెస్ కింద మార్చి బెదిరిస్తుంటారు. లక్షల్లో నగదును డిమాండ్ చేస్తుంటారు. లేదంటే వీటన్నింటిని సోషల్ మీడియాలో పెట్టి మీ పరువును తీస్తామని భయపెట్టిస్తారు.

నీలి చిత్రాలకు దూరంగా ఉండండి : సైబర్ క్రైం పోలీసులు


ఇటీవల ఇలాంటి బెదిరింపుల బారినపడ్డవారు దాదాపు ఏడుగురు ఉన్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఒకరు, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆరుగురు ఈ విధమైన బెదిరింపులకు బాధితులుగా మారారు. ఈ పరిణామంతో కలవరానికి గురైన ఈ బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి మౌఖికంగా ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను విశ్లేషించిన సైబర్ క్రైం అధికారులు పోర్న్ వెబ్‌సైట్స్(అశ్లీల వైబ్ సైట్స్)కు దూరంగా ఉండడం సురక్షితమని సూచిస్తున్నారు. ఎందుకంటే సైబర్ మాయగాళ్లు పంపించే వైరస్‌తో మీ ఫోన్, కంప్యూటర్‌లోని ప్రతి అంశం వారి కంటికి ఎదురుగా ప్రత్యక్షమవుతున్నది. నీలి చిత్రాలే కాకుండా మీ ఇతర వ్యక్తిగత, వాటిలో ఉండే రహస్య సమాచారం, ఇతర ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే అవి కూడా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. దీంతో వారు రెచ్చిపోయి మిమ్మల్ని టార్గెట్ చేయడంతోపాటు మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకు నీలి చిత్రాలకు దూరంగా ఉండి, సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో పడకుండా క్షేమంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు కోరుతున్నారు.

8671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles