కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుగా యాకూబ్

Fri,March 23, 2018 08:47 PM

కారేపల్లి : కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుగా డాక్టర్ కవి యాకూబ్‌ను నియమించారు. కేంద్ర సాహిత్య అకాడమీ సెక్రెటరీ డాక్టర్ కె.శ్రీనివాసరావు నుంచి నియామకపు ఉత్తర్వులు అందుకున్నారు. 2018నుంచి 2022 వరకూ యాకూబ్ కేంద్ర సాహిత్య అకాడమీలో సలహాదారుగా ఉంటారు. తెలుగు సాహిత్యంలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన ఆయన పలు కవితాసంపుటాలు, గ్రంథాలు రాశారు. తెలుగు సాహిత్య విమర్శలో ఆధునిక ధోరణులు అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లోని గోల్కొండ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు సాహిత్యంలో వివిధ సంస్థల నుంచి 16 అవార్డులను యాకూబ్ అందుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రొట్టమాకురేవు గ్రామానికి చెందిన యాకూబ్ కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుగా నియమింపబడటంతో పాటు తెలంగాణకు చెందిన కవికి అరుదైన గౌరవం లభించడం పట్ల ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కవులు అభినందనలు తెలిపారు. రొట్టమాకురేవును సాహిత్య కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రొట్టమాకురేవు కేంద్రంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్న యాకూబ్ జాతీయస్థాయికి ఎదగడం పట్ల జిల్లా సాహితీ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యరంగంలో ఎనలేని కృషిచేసి నాలుగు కవిత్వ సంకలనాలు, మూడు విమర్శనా గ్రంథాలు, అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సామాజిక మాధ్యమంలో కవి సంగమం, కవిత్వ వేదికను ప్రారంభించి ఐదేళ్లుగా కొత్తతరం, పాతతరం కవులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. కవిత్వ వాతావరణాన్ని సృష్టించి నిరంతరం సాహిత్య సేవచేస్తూ పలువురి మన్ననలను పొందుతున్నారు. యాకూబ్ తన స్వగ్రామమైన రొట్టమాకురేవులో కేఎల్ పుస్తక సంగమం పేరుతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ పుస్తక సంగమంలోనే ప్రతీ ఏట ప్రముఖ కవులకు రొట్టమాకురేవు కవిత్వ అవార్డులను అందజేస్తూ.. ఆ పల్లెను సాహిత్య కేంద్రంగా మలిచేందుకు కృషిచేస్తున్నారు.

1785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles