వైభవంగా శ్రీలక్ష్మీనృసింహుని కళ్యాణమహోత్సవం

Fri,March 15, 2019 11:00 PM

యాదాద్రి భువనగిరి : చరా చర జగత్తు తనివితీరా దర్శించి మహాదానందంతో పులకరించి పోతుండగా... లోకాలను రక్షించుటే దీక్షగా మాంగల్యమనే తంతు సాక్షిగా దేవేరులు ఒక్కటయ్యే వేళ తలంబ్రాలు తారలుగా మెరిసిపోతున్నవేళ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని తిరుకళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి బాలాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటల కు, రాత్రి కొండ కింద జడ్పీ హైస్కూల్ ఆవరణలో శ్రీవారి కల్యాణమహోత్సవం కోలాహలంగా అర్చకులు నిర్వహించారు.


ఉదయం బాలాలయంలో జరిగిన కళ్యాణంలో రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్‌లు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆకాశమంత పందిరితో భూదేవి అంత పీటలతో జగదానందదాయకంగా కళ్యాణతంతు జరిగింది. ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, యాజ్ఞీకులు ఎస్. శ్రీనివాసాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు శ్రీవారి కల్యాణతంతును వైభవంగా నిర్వహించారు.

లోకాలను రక్షించుటే దీక్షగా మాంగల్యమనే తంతు సాక్షిగా దేవేరులు ఒక్కటయ్యే వేళ తలంబ్రాలు తారలుగా మెరిసిపోయాయి. 33 కోట్ల దేవతలు పూలవర్షం కురిపిస్తున్నారా అన్నట్లుగా టపాకాయలు వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి. అద్వైతులు, భక్తకోటి, దేవకోటి చరా జగత్తు అంతా శ్రీవారు జగదానందదాయకంగా చేసుకునే తిరుకళ్యాణ వేడుకలను యాదాద్రిలో తనివితీరా దర్శించి మైమరచిపోయారు. జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈఓ గీత, అనువంశికధర్మకర్త బి.నర్సింహామూర్తిలు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు.

వేదపండితుల వేదఘోష, హాజరైన విశేష భక్తజనం వేయి కళ్లు చాలవా అన్నట్లు చూస్తుండగా కల్యాణతంతు జరిగింది. 33 కోట్ల ఇంద్రాదిదేవతలు తరలివచ్చి ఆకాశంనుంచి పూలవర్షం కురిపిస్తున్నారా అన్నట్లు బాణాసంచా మిరిమిట్ల మధ్య కల్యాణతంతు మొదలైంది. భక్తులు భాగ్యోత్సవాలుగా భావించే లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన కల్యాణతంతును వీక్షించడానికి అశేష భక్తజనం యాదాద్రికొండకు తరలివచ్చారు.

తుల లగ్నంలో...


రాత్రి తుల లగ్నంలో శ్రీస్వామి వారికి, అమ్మవారికి వివాహం జరిపించారు. కళ్యాణం అనగా వేరు వేరు రెండు తత్వములు ఒక్కటి అగుట. ఇరువురి మాటలు, ఇరువురి నడవడికలు..ఇరువురి భావనలు ఏకత్రితమై జగతికి ఆనందమును పంచుట అని అర్ధము. బ్రహ్మాది దేవతలు శ్రీవారిని కొలుస్తుండగా భక్తిపూర్వకంగా వేదపండితులు కార్యక్రమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, నాదస్వరం, భక్తినినాదాల మధ్య పరిణయనోత్సవ వేడుక వైభవంగా జరిగింది.

భక్తుల నుంచి తలంబ్రాలను సిబ్బంది సేకరించారు. కల్యాణం ముగిశాక అతిథులకు స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. కల్యాణ మహోత్సవాన్ని భక్తులకు దగ్గరగా, అన్ని పక్కల వారికి కనువిందు చేసేందుకు వీలుగా ఎక్కడికక్కడ క్లోజుడ్ సర్క్యూట్ సీసీటీవీలను ఏర్పాటు చేశారు. కల్యాణతంతు రాత్రి 8 గంటలకు మొదలై అర్ధరాత్రి వరకు జరుగుతున్నందున కల్యాణతంతు ఘట్టాలన్నింటినీ వీక్షించేందుకు ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు.

ఉదయం శ్రీవారు శాంతమూర్తి అయిన శ్రీరామునిగా భక్తులకు దర్శనమించ్చారు. హనుమంతవాహనంలో బాలాలయంలో విహరించారు. గవర్నర్ ఉత్సవాల్లో పాల్గొనడంతో జడ్ కేటగిరి బందోబస్తును ఏర్పాటు చేశారు. కొండ కింద జరిగిన కళ్యాణమహోత్సవంలో భారీగా భక్తులు పాల్గొన్నారు.డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి ఏసీపీ మనోహర్‌రెడ్డి భారీ బందోబస్తును పర్యవేక్షించారు.

897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles