
హైదరాబాద్: గుండెపోటు.. ఈ పేరు వింటేనే హడలిపోతాము. ఒకప్పుడు పెద్ద వయస్సులో వచ్చే పోటు.. మారుతున్న కాలానుగుణంగా యుక్త వయస్సులోనూ కబళిస్తోంది. ఉన్నట్టుండి కుప్పకూలి పోవడం.. నిద్రలో ఉండగానే గుండెపోటు రావడం సాధారమవుతోంది. ఉడుకు రక్తం, ఉరకలేసే వయస్సు వారికి హార్ట్-ఎటాక్ రావడం నిజంగా దురదృష్టకరమే. 20 నుంచి 30 ఏండ్ల లోపు వారికి గుండెపోటు రావడమేంటి...ఇది చాలా దారుణం అనుకుంటున్నారా..కాని ఈ మధ్యకాలంలో ఈ వయస్సు వారే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నట్లు గుండె వైద్యనిపుణులు తెలిపారు. దీనికి ఇటీవల ఓ మాజీ కేంద్ర మంత్రి కుమారుడి ఉదంతమే నిదర్శనం.
ఇలాంటి ఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. చిన్న వయస్సులోనే హృద్రోగ సమస్యల విషయాన్ని ఆరేండ్ల క్రితమే ఇంటర్ హార్ట్ స్టడీ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) హెచ్చరికల ప్రకారం 2020 నాటికి భారత్లో గుండెపోటు బాధితుల సంఖ్య పెరిగిపోతుందని ఉస్మానియా దవాఖాన గుండె వైద్యనిపుణులు డా.కె.ఎం.కె.రెడ్డి తెలిపారు. గుండె సంరక్షణ, గుండె వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతియేటా సెప్టెంబర్ 29ని ప్రపంచ గుండె దినోత్సవంగా పరిగణిస్తున్నారు.
యువతలోనే ఎందుకు..?
- సాధారణంగా కొలెస్ట్రాల్(కొవ్వు) లెవల్స్ పెరిగిపోవడం, అధిక ఒత్తిడి వల్ల గుండెపోటు, గుండెలోని నాళాల్లో అవరోధం ఏర్పడి పోటుకు దారితీస్తుంది. - అధికంగా ధూమపానం చేసేవారు, అధిక బరువుతో బాధపడే వారితోపాటు వంశపార్యపరంగా కూడా గుండెపోటు వస్తుంది. - సాధారణంగా మాస్సివ్ హార్ట్-ఎటాక్ అనేది ఏ వయస్సు వారికైనా వస్తుంది. ఇది వృద్ధుల కంటే యువతకే ఎక్కువ ముప్పు కలిగిస్తుంది. -గతంలో వయస్సు మీదపడిన వారికే గుండె సమస్యలు, గుండెపోటుగాని వచ్చేవి. ప్రస్తుతం ఉరుకులు,పరుగుల జీవన విధానంలో యువత అధిక ఒత్తిడికి గురవుతున్నది. -అర్ధరాత్రి దాటినా నిద్రపోకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు గురవడం. - మాస్సివ్ హార్ట్-ఎటాక్ అనేది 70 ఏళ్ల వయస్సు వారికంటే 30లోపు వయస్కులకే ప్రమాదం. - ప్రధానంగా ఐటీ ఉద్యోగులు గుండెపోటుకు గురవుతున్నట్లు సర్వేల్లో తేలింది. తగినంత విశ్రాంతి లేకపోవడం, ఎక్కువ గంటలు పనిచేయడం వల్లే ఇబ్బందే. - ప్రతిఒక్కరూ ఏడాదికి ఒకసారి మాస్టర్ హెల్త్చెకప్ చేయించుకోవడం ఉత్తమం.
ఇలా చేయడం మంచిది..
- సాధ్యమైనంత వరకు ఉన్నంతలో సంతోషపడాలి- మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి- రోజుకు 7 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి- సరదాగా, ఉల్లాసంగా ఉండాలి. - ఒకే అంశంపై పదేపదే ఆలోచించకూడదు- ప్రతిరోజు కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాలి.- ఆకుకూరలు, తాజాపండ్లు తీసుకోవాలి.