దివ్యాంగులకు రాష్ట్రప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది...

Tue,December 3, 2019 05:30 PM

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పూర్తి అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్న చోట వికలాంగులు ఉన్నట్లయితే వారికి కూడా అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాలులో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికలాంగులకు వికలత్వం కోరుకుంటే వచ్చింది కాదని, జన్యుపరంగా, అనారోగ్య రీత్యా, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వికలత్వం వచ్చిందని, అంతమాత్రం చేత వారు సమాజంలో ఎవరికంటే తక్కువ కాదని, వికలాంగులు చాలా తెలివైన వారని, వీరికి మనోధైర్యంతో పాటు, మనోనిబ్బరం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వికలాంగుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు వేల పదహారు రూపాయలు పింఛన్ ఇస్తుందని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో స్థలం ఇస్తే వికలాంగుల భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి వికలాంగులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.


జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ . లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని వికలాంగుల ముందుకెళ్లాలని, సమస్యల పరిష్కారానికి సావధానంగా కృషిచేయాలని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని, వికలాంగులు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలనిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, అందువల్ల వికలాంగులు మనోధైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాలని కోరారు. వికలాంగులు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు బస్టాండ్ లో మూడు చక్రాల రిక్షాలను ఏర్పాటు చేసే విషయం ఆలోచిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన వికలాంగులకు సదరం శిబిరాల ధ్రువ పత్రాలను, వికలాంగుల ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అంతేకాక ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పూర్తిచేసుకున్న వికలాంగులకు కూడా ధృవ పత్రాలను అందించారు. కొంతమంది వికలాంగులను శాలువాలు, జ్ఞాపిక లతో సన్మానించారు.

270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles