కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నాం: సీఎండీ ప్రభాకర్‌రావుSat,November 18, 2017 05:26 PM
కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నాం: సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖకు ఇవాళ చాలా గొప్ప శుభదినమని జెన్‌కో - ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. కనురెప్ప పాటు కూడా కరెంట్ పోకుండా ఉండటం కోసం తమ యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నట్లు ఆయన ఉద్ఘాటించారు. ప్రగతి భవన్‌లో శనివారం విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి స‌మావేశ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే.

విద్యుత్ శాఖ సమీక్ష పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎండీ ప్రభాకర్ రావు...సీఎం కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి సమీక్ష విద్యుత్ శాఖదే అని..రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించాలని.. ఆరోజు సీఎం మార్గ నిర్దేశనం చేశారని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యం, గుర్తింపును సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖకు ఇచ్చారని ఆయన తెలిపారు. దాని వల్లే మార్పు సాధ్యమైందన్నారు. నిరంతర విద్యుత్ అందించాలన్న సీఎం సంకల్పాన్ని నిజం చేయడం కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర సారథ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకోవడం తమకు దక్కిన గొప్ప అవకాశంగా విద్యుత్ ఉద్యోగులు భావిస్తున్నారని సీఎండీ వెల్లడించారు. విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు అనేక చర్యలు తీసుకున్నామని.. ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్స్ 30 నుంచి 4 శాతానికి తగ్గాయన్నారు. పంపిణీ, సరఫరా నష్టాలు 18 నుంచి 16 శాతానికి తగ్గాయన్నారు. సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల సంఖ్యను భారీగా పెంచామని ఈ సందర్భంగా ప్రభాకర్ రావు విశదీకరించారు.

విద్యుత్ ఉద్యోగులకు కృతజ్ఞ‌తలు తెలిపిన సీఎం కేసీఆర్
"తెలంగాణ ఏర్పడినప్పుడు కరెంట్ విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నాం. నేడు అన్ని వర్గాలకు 24 గంటల కరెంటు ఇచ్చుకుంటున్నాం. జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు అందుతుంది. ఇది సాధారణ విషయం కాదు. అద్భుత విజయం. ఈ విజయాన్ని సాధించిన విద్యుత్ శాఖ ఉద్యోగులకు అభినందనలు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసి ఈ విజయం చేకూర్చిన ప్రతీ విద్యుత్ ఉద్యోగికి కృతజ్ఞ‌తలు. మీకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. మీ ప్రమోషన్లు, ఇతర విషయాల్లో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది.." అని సీఎం చెప్పారు.

1583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS