హెల్మెట్‌ ధరించి ఉంటే..యువతి బతికి ఉండేది

Fri,March 15, 2019 06:30 AM


మాదాపూర్‌ : ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు ఆ కారణంగా బండి నడుపుతున్నవారే హెల్మెట్‌ ధరిస్తారు. కానీ వెనుక కూర్చుకున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందే. మోటార్‌ వాహనాల చట్టంలో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు మన నగరంలో దీనిపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో వెనుక కూర్చున్న వారెవ్వరూ కూడా హెల్మెట్‌ ధరించడంలేదు. అయితే వారు కూడా హెల్మెట్‌ ధరిస్తే ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంది. ఈ రోజు మాదాపూర్‌లో హెల్మెట్‌ ధరించకపోవడంతోనే బండి వెనుక కూర్చున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. హెల్మెట్‌ ధరించి ఉంటే ఆమె కలకాలం క్షేమంగా ఉండేదేమో!


ఓ నిఫ్ట్‌ విద్యార్థి మరో పది నిమిషాల్లో క్లాసులకు చేరుకోనుండగా, ట్రక్కు ఢీకొని మృతి చెందిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ఎ.శ్రీనివాస్‌ తెలిపిన కథనం ప్రకారం... మహారాష్ట్రలోని పుణెకు చెందిన మిథాలీశర్మ(20)బోరబండలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ మాదాపూర్‌లోని నిఫ్ట్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ)లో ఆరవ సెమిస్టర్‌ చదువుతుంది.

నిఫ్ట్‌కు వెళ్దామని ఉదయం 11:45 గంటలకు తన స్నేహితుడు రిక్తిమ్‌తో కలిసి హోండా ఆక్టివాపై బోరబండ నుంచి మాదాపూర్‌కు వస్తున్నారు. కాగా, అయ్యప్పసొసైటీ 100 ఫీట్‌ రోడ్డు మార్గంలో వస్తుండగా ముందు ఉన్న ట్రక్కును తప్పించబోయి సడన్‌ బ్రేక్‌ వేయడంతో ద్విచక్ర వాహనం పైనుంచి జారి కిందపడ్డారు. రిక్టిమ్‌కు స్వల్పగాయాలు కాగా, వెనుకాల కూర్చున్న మిథాలీశర్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికుల సాయంతో దగ్గరలోని ఓ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మిథాలీ మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే వెనుకాల కూర్చున్న యువతి హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

4726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles