ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య

Sat,May 18, 2019 11:13 PM

wife killed husband with her lover in jangaon district

-మద్యం మత్తులో మృతి చెందాడని ప్రచారం
-పెళ్లి చేసుకోకపోవడంతో పోలీసుల ముందు బహిర్గతం
-నాలుగు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన హత్యోదంతం
-పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు


జనగామ: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్తను కడతేర్చింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతిచెందాడని అందరినీ నమ్మించింది. సుమారు నాలుగు నెలల పాటు హత్య చేసిన విషయం బయటకు పొక్కకుండా వ్యవహరించింది. ప్రియుడు తనను వివాహం చేసుకోవడం లేదనే ఆవేశంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గుట్టును బహిర్గతం చేసింది. దీంతో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు హత్యపై వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

విశ్వసనీయ సమాచారం మేరకు జనగామ జిల్లా చిలుపూరు మండల కేంద్రానికి చెందిన వెలిశాల రవి (39) మద్యానికి బానిసై భార్యను పట్టించుకోవడం లేదు. దీంతో అతని భార్య వెలిశాల రజిత తమ ఇంటిపక్కనే ఉన్న మాచర్ల సాంబరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమకు అడ్డుగా ఉంటున్న రవిని హతమార్చాలని వారిద్దరూ భావించారు. దీనికి తోడు రవిని హతమార్చిన తర్వాతే రజితను పెళ్లి చేసుకుంటానని సాంబరాజు హామీ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో గత జనవరి 29న రాత్రి రవి మద్యం మత్తులో ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఇదే అదునుగా భావించిన రజిత, సాంబరాజు చున్నీని రవి మెడకు చుట్టి హత్య చేశారు. మద్యం సేవించిన రవి నీళ్లు లేక గొంతెండిపోయి చనిపోయాడని ప్రచారం చేశారు. దీనిని నమ్మిన గ్రామస్తులు రవి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా సాంబరాజు తనను వివాహం చేసుకోవడం లేదని రజిత పెద్దలను ఆశ్రయించింది.

వారు చెప్పనప్పటికీ సాంబరాజు అంగీకరించకపోవడంతో శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రజిత తన భర్తను హత్య చేసిన విషయాన్ని బట్టబయలు చేసింది. దీంతో స్థానిక ఎస్సై శ్రీనివాస్ సాంబరాజును కూడా అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. మృతుడిని ఖననం చేసిన ప్రాంతానికి వెళ్లి అస్థికలను సైతం సేకరించారు. ఈ విషయమై ఎస్సై శ్రీనివాస్‌ను సంప్రదించగా అస్థికలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. కాగా, రజితకు 14 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కూతురు ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు.

3445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles