
బేగంబజార్: కొంతమందిలో అనుకోకుండా అకస్మాత్తుగా గుండెనొప్పి లేదా గుండెపోటు వస్తుంది. గుండెల్లో సన్నగా మొదలైయిన నొప్పి తీవ్రతరమవుతుంది. అలాంటప్పుడు.. అకస్మాత్తుగా గుండె పోటు వస్తే వారికి చేతులతో 30 సార్లు సంపీడనం చేయడం ద్వారా ప్రాణం నిలబడుతుందని అనస్థీషియా విభాగం హెచ్వోడీ డాక్టర్ పాండునాయక్ పేర్కొన్నారు. 'వరల్డ్ రిస్టార్ట్ ఏ హార్ట్ డే' ను పురస్కరించుకుని మంగళవారం ఉస్మానియా దవాఖానలోని అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ పర్యవేక్షణలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్(సంపీడనం చేయడం ద్వారా ఓ జీవితానికి మద్ధతు)అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పవర్ ప్రజెంటేషన్ ద్వారా రైలు, బస్సు ప్రయాణాల్లో ఉన్న సమయంలో ఎవరికైనా అకస్మాత్తుగా గుండె పోటు వస్తే వారికి చేతులతో 30 సార్లు సంపీడనం ఎలా చేయాలని డెమో ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణాల్లో అకస్మాత్తుగా గుండె పోటు వస్తే తోటి వ్యక్తిని కాపాడేందుకు మానవతా ధ్రుక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అందుకోసమతే సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వారం రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి ఔట్ పేషెంట్ బ్లాక్ వద్ద ప్రజలకు, రోగి సహాయకులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. డాక్టర్లు దయాల్సింగ్, పావని, మురళీధర్, ఉమ, జ్యోతి, సునీల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.గాంధీ దవాఖానలో..గాంధీ దవాఖాన : వరల్డ్ రిస్టార్ట్ ఏ హార్ట్ డే ను పురస్కరించుకుని సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో అనస్థీషియా వైద్యులు డాక్టర్ నాగార్జున నేతృత్వంలో రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిపై ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో అవగాహన కల్పించేందుకు తనవంతుగా ముందుకు సాగుతామన్నారు. జర్నలిస్టు సంఘాలకు సైతం ఒక వేదికను ఏర్పాటు చేసి వారందరికి అవగాహన కల్పించేందుకు భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనస్థీషియా పీజీ వైద్యులు, జూనియర్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.