పేద బ్రాహ్మణులందరికి అండగా ఉంటాం: కేటీఆర్

Thu,November 8, 2018 06:02 PM

We helps poor brahmins says minister ktr

హైదరాబాద్ : రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. దేశం మొత్తంలో ట్రెజరీ నుంచి పురోహితులకు జీతాలు ఇస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని వండర్ పార్కులో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..బ్రాహ్మణుల స్థితిగతులు సీఎం కేసీఆర్ కు తెలిసినంతగా ఏ ముఖ్యమంత్రికి తెలియవన్నారు. విశ్వకల్యాణం కోసం కేసీఆర్ ఆయుత చండీయాగం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నమ్మిన సిద్ధాంతం ప్రకారం నడుస్తారని..దేవాలయాల అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, కేసీఆర్ మాదిరిగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి దేవాలయాలను అభివృద్ధి చేయలేదని కేటీఆర్ తెలిపారు. గోదావరి పుష్కరాలు తెలంగాణలో జరపాలని కేసీఆర్ అప్పట్లోనే డిమాండ్ చేసినట్లు చెప్పారు. మీ ఆశీర్వాదం, ఎన్నికల్లో మద్దతు కోసం వచ్చానని బ్రాహ్మణులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు.

చంద్రబాబు తెలంగాణను ముంచే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు ఏపీని, అక్కడి సమస్యలను వదిలి తెలంగాణ మీద పడ్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పేదరికానికి కులంతో సంబంధం లేదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చినంక సంక్షేమానికి పెద్ద పీట వేశామని, 450పైగా పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. మరో 1200 ఆలయాలకు ధూప దీప నైవేద్యం కోసం ప్రయత్నం చేస్తుంటే.. ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. బ్రాహ్మణుల కోసం 17 పథకాలు ప్లాన్ చేశామని, ప్రస్తుతం 5 పథకాలు మాత్రమే అమలు అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికల తర్వాత మిగిలిన పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

1735
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles