ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధం: కవిత

Wed,July 11, 2018 07:53 PM

we are ready for elections mp kavitha says

జగిత్యాల: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు జరిగినా, విడివిడిగా ఎన్నికలు జరిగినా బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు.

ఇవాళ జిల్లాలోని కోరుట్లలో కోరుట్ల, మల్లాపూర్ మండలాల టీఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కవిత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెంట నడుస్తానని పార్టీని పటిష్టం చేస్తామని సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అమరవీరులకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు కోరుట్ల లో పాలిటెక్నిక్ నూతన భవనాన్ని కవిత ప్రారంభించారు.

ఈసందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్నో అవమానాలు, తిట్లను భరించి లక్ష్యాన్ని సాధించారని చెప్పారు. పదిహేనేళ్ల స్వరాష్ట్ర ఉద్యమ నాయకులు కేసీఆర్ వల్లనే తెలంగాణ బాగు పడుతుందని ప్రజలు అధికారాన్ని అప్పగించారని తెలిపారు. రేపటి తెలంగాణ బిడ్డల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆ పనులను కొనసాగించడానికి పార్టీ పటిష్టంగా ఉండాలని అప్పుడే మన బంగారు తెలంగాణ సాకారం అవుతుందని వివరించారు. కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని అన్నారు.

ఈ సందర్భంగా కవిత ఓ కథ చెప్పారు. ద్రోణాచార్యుడు కౌరవులు పాండవుల పిల్లలకు విలువిద్య నేర్పిస్తున్నప్పుడు ఒక రోజు చెట్టుపై ఉన్న ఒక పిట్టను చూపించి దాని కన్ను చూసి బాణం కొట్టాలని అన్నారట. దుర్యోధనుడు, భీముడు చెట్టు చూశామని, పిట్టని చూశామని చెప్పారట. కాని అర్జునుడు మాత్రం పిట్ట కన్ను కనబడుతుంది అని చెప్పాడని.. అదే లక్ష్యానికి సంకేతమని వివరించారు. కేసీఆర్ లక్యాన్ని గురి చూసి కొట్టే గురువు అని చెప్పారు. కేసీఆర్ కు ఆ శక్తిని కార్యకర్తలు ఇచ్చారని కవిత అన్నారు.

దుర్మార్గులు కూడా వేల కొద్ది మంది పుట్టారని, వారు చేస్తున్న చెడ్డపనులను మంచివాళ్లు చూస్తూ కూర్చోవడం క్షమించరాని నేరం అన్నారు. నిజంగానే మంచివాళ్ళయితే బయటికి వచ్చి వాళ్ళని ఎదిరించాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న వారిని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని ఆన్నారు. ముచ్చట్లు కాదు కావాల్సింది పని.. కార్యకర్తలు ఆ పని చేయాలని కార్యసాధకుడు అయిన కేసిఆర్ కు వెన్నంటి ఉండాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు.

గొర్రెపల్లి గ్రామంలో 1436 మంది జనాభా ఉందని, 350 గడపలు ఉంటే 391 మందికి పెన్షన్ లు అందుతున్నాయని చెప్పారు. రూ.10 కోట్ల 60 లక్షల 58 వేల రూపాయలు గొర్రెపల్లి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని కవిత తెలిపారు. కోరుట్ల, మల్లాపూర్ మండలాల్లో రూ.250 కోట్లు ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఖర్చు చేసిందని కవిత వివరించారు.

ఇటీవల ఆర్మూర్ లో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ హాజరు అయ్యారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.38 కోట్లను కేటాయించిందని, ఇప్పుడు కేసిఆర్ రెండు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని ప్రస్తావించి ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారని ఆమె తెలిపారు.

3 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ ల సామర్ధ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉండేదని ఇప్పుడు 19 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ ల సామర్ద్యం ఉందని మార్కెట్ చైర్మన్ లోక బాపురెడ్డి చెప్పారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ముందుచూపు పనులకు నిదర్శనమని ఎంపీ వివరించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ వర్గాలకు రుణాలు ఇప్పించడం ద్వారా ఆర్థికంగా చేయూతనందించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు ఎప్పుడు విశ్రాంతిగా ఉండకూడదని సూచించారు.

సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జ్ బస్వరాజు సారయ్య, బెవరెజేస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాదరావు, మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి కార్యకర్తల బాధ్యతలను వివరించారు. ఉద్యమ సమయంలో చూపిన తెగువ, కార్యాచరణ ఇప్పుడు పార్టీ పటిష్టత కోసం రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

1843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles