శ్రీశైలం : హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేసిన అనంతరం శ్రీశైలం చేరుకున్న విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు శ్రీశైల ఆదిదంపతులను దర్శించుకున్నారు. శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి పీఠాధిపతులతో కలిసి ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ డా.ఎం.పద్మ ఐఏఎస్, ఆలయ ఈవో కేఎస్ రామారావు వేదపండితులు ప్రధాన అర్చక స్వాములతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పీఠాధిపతులకు వేదగోష్టి నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ ప్రచారంతోపాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ధర్మప్రచారం చేస్తూ హోమ జప ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేసేందుకు తొలుతగా శ్రీశైల ఆదిదంపతుల ఆశీస్సులు పొంది కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు.