విద్యాలక్ష్మి పథకం కోసం అప్లై చేసుకోండిలా...

Fri,July 12, 2019 09:07 AM

vidyalakshmi scheme for higher education students

హైదరాబాద్ : ఉన్నత విద్య, విదేశాల్లో చదువు కోసం గతంలో విద్యార్థులు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సిఫార్సులు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ పూచీకత్‌లు సమర్పించాల్సి వచ్చేది. అయినా రుణం మంజూరు అవుతుందో లేదో తెలియని పరిస్థితి. పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం 2015-16 బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అప్పట్నుంచి ఏటా కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. చదువు వివరాలు వాస్తవికతతో కూడి ఉంటే చాలు రుణం పొందడం తేలికే. చాలా మందికి ఈ పథకంపై అవగాహనలేక సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. విద్యా రుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరుగాలనే అపోహ ఉన్నది. ఆ అవసరం లేకుండా ఇంటి నుంచి దరఖాస్తు చేసుకుని రుణం పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తున్నది. ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఎన్‌ఎస్‌డీఎల్ ఈ-గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఏయే చదువులకు..?


ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ డిప్లొమా ప్రొఫెషనల్ కోర్సులు, కాస్ అకౌంటెన్సీ, చార్టెడ్ అకౌంట్, ఐఐఎం మేనేజ్‌మెంట్, ఐఐటీ, వృత్తి విద్యా కోర్సులు, విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదివే వారికి రుణాలు ఇస్తారు. యూజీసీ, ఎఐసీటీఈ ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి రుణాలు అందుతాయి.

బ్యాంకుల ద్వారా..


ఈ పోర్టల్‌లో 36 బ్యాంకులు నమోదయ్యాయి. అవి విద్యా రుణాలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, కెనరాబాయక్, విజయ, ఐవోబీ, యూనియన్, ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ, యూబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యూకో, దీనా, కరూర్‌వైశ్య, సిండికేట్, టీఏఏబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యాక్సిస్, ఫెడరల్, న్యూఇండియా, అలహాబాద్, ఆర్‌బీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల నుంచి నేరుగా రుణాలను పొందవచ్చు.

దరఖాస్తు చేసే విధానం..


విద్యా రుణం కోసం మూడు పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా విద్యాలక్ష్మి పోర్టల్ నమోదు కావాలి. తర్వాత వివరాలతో కూడిన దరఖాస్తు పూరించాలి. చివరగా వివిధ రకాల బ్యాంకులను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాలు మొబైల్, ఈ-మెయిల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది.

రుణం పొందేందుకు నమోదు ఇలా..


విద్యాలక్ష్మి పథకం పోర్టల్‌లో నమోదు చేసుకున్నాక www.vidyalakshmi.co.inవెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలి. ఒక విద్యార్థి ఒకేసారి గరిష్ఠంగా మూడు బ్యాంకులకు విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నది.

ఎంత వరకు రుణం ఇస్తారు?


విద్యా లక్ష్మి పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో రూ.4.5 లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తున్నది. అమ్మాయిల చదువును ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థినులకు మరింత రాయితీ కల్పిస్తున్నారు. అయితే రుణం రూ.7.5లక్షలు దాటితే పూచీకత్ ఉండాలి. జాతీయ ఉపకార వేతనాలను సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

జత చేయాల్సిన పత్రాలు..


విద్యా లక్ష్మి పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద విద్యా రుణాలు పొందేందుకు విద్యార్థులు పలు పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. చదివిన విద్యా సంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం(టీసీ), మార్కుల జాబితా, ఇంత వరకు పొం దిన ఉపకార వేతన పత్రాలు, ఉన్నత విద్యకు సంబంధించి ర్యాంకు కార్డు, ప్రవేశ అనుమతి పత్రా లు, చదువాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి, తండ్రి, సంరక్షకుడు, విద్యార్థికి సంబంధించిన పాస్ ఫొటోలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు, నివాస ధ్రువీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు లాంటివి జత చేయాలి.

5004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles