మన భాష, యాసను కాపాడుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య

Fri,December 15, 2017 08:36 PM

vice president venkaiah naidu speaks at world telugu conference hyderabad

హైదరాబాద్: మన భాష, యాసను మనమే కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నగరంలో ఎల్బీ స్టేడియంలో ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తెలుగు నేలను తాకకపోతే తనకు ఏదో కోల్పోయినట్లు ఉంటుందన్నారు.

అందుకే జన్మభూమిలో నెలకొక్కసారైనా అడుగుపెట్టకుండా ఉండలేనన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం తనకు చెప్పలేనంత సంతోషం కలిగించిందన్నారు. చక్కటి మాటలతో సీఎం కేసీఆర్ ముందే విందు భోజనం పెట్టేశారన్నారు. తెలుగు వారంతా ఒక్కటేనని తాను ఎప్పుడూ నమ్ముతానన్నారు. ఢిల్లీలో తెలుగుమాట వినిపిస్తే పలకరించి స్నేహం చేసుకునే వాడిననని.. ఢిల్లీలో తెలుగు వాళ్లనంతా ఒక చోట చేర్చి వారితో మాట్లాడితే ఆ ఆనందం అనిర్వచనీయం అని ఈ సందర్భంగా వెంకయ్య గుర్తు చేశారు.

గురువులను సత్కరించడం, సత్ప్రవర్తన, సదాచారానికి చిహ్నమన్నారు. గురువును సత్కరించి సత్ప్రవర్తన గుర్తు చేసిన సీఎం కేసీఆర్‌కు వెంకయ్య ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. మన జీవితంలో గురువు ప్రాధాన్యత ఎప్పటికీ ఉంటుందని... గురువుకు ప్రత్యామ్నాయం ఎవరూ కాదన్నారు. సీఎం కేసీఆర్‌కు భాషపై అమితమైన ప్రేమ ఉందని... సీఎం కేసీఆర్ సాహితీ ప్రియులన్నారు. మానవ సంబంధాల వ్యక్తీకరణే భాష అన్న వెంకయ్య... తెలుగు భాషకు ప్రాచీనమైన చరిత్ర ఉందన్నారు.

భాష సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. భాష సహజమైన ప్రవాహమన్నారు. కన్న తల్లిదండ్రులు, గురువులు, మాతృభూమిని మరవొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలియజేశారు. గురువుకు ప్రత్యామ్నాయం గూగుల్ కాదని.. ఇంటర్నెట్ సెర్చ్ చేసేందుకైనా గురువు ఉండాల్సిందేనన్నారు. తరగతి గది తరగని నిధి అని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ గడ్డపై ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

పద్యం, గద్యం అంటే కేసీఆర్‌కు ఎనలేని అభిమానమన్నారు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగని వెంకయ్య గుర్తు చేశారు. తెలుగు భాష తనకు తల్లి అని వెంకయ్య ఉద్ఘాటించారు. అమ్మ భాష కండ్లలాంటిందని... పరాయి భాష కండ్లద్దాలలాంటిదని వెంకయ్య నాయుడు చమత్కరించారు.

1726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles