ఏం కొందాం.. ఏం తిందాం..

Mon,May 20, 2019 07:50 AM

vegetable rates increase in Telangana

హైదరాబాద్ : మార్కెట్‌ల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏ కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదు. ఏ రకం కూరగాయలు కొనాలన్నా.. ఆకాశన్నంటిన ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. అంతటి ధరలు పెట్టి ఎల కొనుగోలు చేయాలో తెలియని అయోమయంలో పడిపోతున్నారు. మరో వైపు చికెన్ ధరలు సైతం పెరిగాయి. ఇప్పటికే మటన్ ధరలు సామాన్యుడికి అందనంత దూరంలోకి వెళ్లిపోయాయి. ఇలా పెరిగిన ధరలతో ఏం కొనలేని.. తినలేని పరిస్థితి నెలకొన్నది.

వేసవి ఫలితంగానే..
గతంలో పక్క రాష్ర్టాల నుంచి కూరగాయలు దిగుమతి అయ్యేవి. కానీ ప్రస్తుతం ఎండల దృష్ట్యా దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. బోరుబావులు వట్టిపోయాయి. దీనికితోడు పెరిగిన ఉష్ణోగ్రతలు, మండుతున్న ఎండలతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గిపోయిందని అంటున్నారు. ఫలితంగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా నీటి కొరతతో పాటు చీడపీడల కారణంగా దిగుబడులు భారీగా తగ్గాయనే చెప్పాలి. ఇతర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సైతం భారీగా కూరగాయలు నగరానికి వచ్చేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి.

ఎర్రబారిన టమాట..
గతంలో గిట్టుబాటు ధర లేక రైతులు మార్కెట్‌లోనే టమాటాలను వదిలేసిన సందర్భాలున్నాయి. అలాంటిది ప్రస్తుతం టమాట ధర ఎరుపెక్కింది. పంట దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్‌లో గిరాకీ పెరిగింది. టమాట ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రస్తుతం మేలు రకం టమాట కిలో రూ.55 నుంచి 60 పలుకుతున్నది. ఏప్రిల్ 13వ తేదీ వరకు కిలో రూ.14 ఉన్న టమాట నెల రోజుల వ్యవధిలోనే రూ.60కి చేరుకుంది.

మార్కెట్‌లో తగ్గిన అమ్మకాలు..
గతంలో మార్కెట్‌కు రూ.200 తీసుకెళ్తే పది రకాల కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు వాపోతున్నారు. కూరగాయల ధరలు పెరిగిపోవడంతో గతంలో కిలో తీసుకునే వారు ప్రస్తుతం 250 గ్రాముల(పావుకిలో), 500 గ్రాముల(అరకిలో)కే పరిమితమవుతున్నారు. నిత్యం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో వినియోగించే మిర్చి, టామాటా, మెంతుకూర, పాలకూర, బీరకాయలు, బీన్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. కూరగాయల ధరలు మండుతుండడంతో రూ.500 పెట్టినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విపరీతంగా పెరిగిన చికెన్ ధరలు..
కూరగాయల ధరలు ఇలా ఉంటే మాంసం ధరలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. నెల రోజులుగా చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. నెల రోజుల కిందట చికెన్(స్కిన్‌లెస్) ధర కిలో రూ.150 నుంచి 160 ఉంది. ప్రస్తుతం అదికాస్త రూ.230 దాటడం గమనార్హం. లైవ్ కోడి 130, విత్ స్కిన్ చికెన్ రూ.200కు పైగా అమ్ముతున్నారు. దీంతో పెరిగిన ధరలతో ఇటు చికెన్ కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, మరోవైపు మటన్ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే కొనడం తగ్గించారు. కిలో మటన్ రూ.550 నుంచి రూ.650 వరకు అమ్ముతున్నారు. దీంతో ప్రజలు కూరగాయలు, మాంసం వైపు చూడాలనే భయపడుతున్నారు.

3015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles