మంథనిలో వేదపాఠశాల

Sun,July 9, 2017 06:44 AM

veda patasala in manthani

హైదరాబాద్: మంథనిలో వేదపాఠశాల, వేదాధ్యయనకేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. పరిపూర్ణానందస్వామిజీ ఆధ్వర్యంలోని శ్రీ పీఠం దీన్ని నిర్వహించనుంది. వేదపాఠశాల ఏర్పాటుకు సంబంధించిన కార్యభారాన్ని మంథని బ్రాహ్మణ పరిషత్తు చేపట్టింది. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను పరిషత్తు బృందం కలుసుకొని ప్రభుత్వం తరఫున సహకారాన్ని అర్థించింది. కవిత నేతృత్వంలో ఈ బృందం త్వరలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలుసుకొని పాఠశాలకు దేవాదాయ శాఖ స్థలాన్ని, ఇతర సహకారాన్ని కోరాలని నిర్ణయించింది.

గత మే నెలలో పరిపూర్ణానంద స్వామీజీ మంథనిలో భగవద్గీత ప్రవచన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా వేదపాఠశాల ప్రస్తావన వచ్చింది. పవిత్రగోదావరి తీరంలో మంత్రపురిగా చరిత్రకెక్కి వేయిమంది ఘనాపాఠీలున్న మంథనిలో వేదపాఠశాల లేకపోవడంపై స్వామీజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన పిలుపుతో అప్పటికప్పుడు రూ.10లక్షల విరాళాలు సమకూరాయి. మహదేవ్ సతీశ్ అనే దాత 6 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ నిధులతో వేదపాఠశాలతో పాటు వేదాధ్యయన కేంద్రం ఏర్పాటుకు అవధాని మోహనశర్మ సారథ్యంలో ఒక కమిటీని వేశారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవస్థానానికి చెందిన 11 ఎకరాల స్థలాన్ని వేదపాఠశాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో కన్వీనర్ అవధాని మోహనశర్మ, శృంగేరీపీఠం ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్ రాజం, ధర్మపురి ఆలయ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని త్వరలో కలుసుకోనున్నారు. శృంగేరీపీఠాధిపతి జగద్గురువు భారతీతీర్థమహాస్వామి త్వరలో తెలంగాణ రాష్ర్టానికి వస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన చేతుల మీదుగా వేదపాఠశాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.

1473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles