మీ ఆసరాకు ధన్యవాదాలు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Wed,June 13, 2018 11:50 AM

Uttam Kumar reddy says thanks to KTR

హైదరాబాద్ : ఒకే ఒక్క ట్వీట్‌తో పేద దంపతుల జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి కేటీఆర్ చొరవకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ఎవరూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి.. వారికి అండగా నిలుస్తున్న విషయం విదితమే. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ట్వీట్ పై కూడా కేటీఆర్ సత్వరమే స్పందించి.. పేద దంపతుల జీవితాల్లో వెలుగులు నింపారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పూరి గుడిసెలో ఉంటున్న ఓ వృద్ధురాలి కుటుంబానికి రూ.500 ఆస్తిపన్నును విధించడంపై రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. శిథిలమైన గుడిసెలో ఉంటున్న వృద్ధ దంపతులకు ఆస్తిపన్ను విధించడాన్ని ప్రస్తావిస్తూ వారికి తగిన న్యాయం చేయాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయించడంతోపాటు, ఆసరా పింఛన్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గారు.. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. కుమ్రంభీం జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శితో పర్యవేక్షించి తప్పిదాన్ని సవరించాలని కోరుతున్నాను. దీంతోపాటు వాళ్లకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందకపోయినా, ఆసరా పింఛన్ ఇప్పటివరకు ఇవ్వకపోయినా ఆ రెండూ అందేలా చర్యలు తీసుకోగలరు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

మంత్రి కేటీఆర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చొరవకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఆ పేద దంపతులు సంతోషంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఉత్తమ్ ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పిదం భవిష్యత్ లో జరగదని అనుకుంటున్నాను అని ఉత్తమ్ పేర్కొన్నారు.

5087
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS