అర్హతలేని ప్రైవేటు టీచర్లకు శిక్షణ : కడియం

Mon,November 6, 2017 12:59 PM

Untrained teachers of private schools will be trained, says Minister Kadiyam Srihari

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో శిక్షణ పొందని ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు శిక్షణ పూర్తి చేయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో శిక్షణ పొందని ఉపాధ్యాయుల పై గౌరవ సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్, యాదవరెడ్డి వేసిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇవాళ శాసన మండలిలో సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 11,262 ఉన్నాయని వాటిల్లో 92,675 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వీరిలో 3905 మంది మాత్రమే శిక్షణ పొందని ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. ఈ శిక్షణ పొందని ఉపాధ్యాయులు ఇంటర్మీడియట్ లో 50 శాతం మార్కులు పొంది శిక్షణ పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి31, 2019 వరకు గడువు ఇచ్చిందని మంత్రి తెలిపారు.

కేంద్ర మానవ వనరులఅభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు డి.ఈ ఈ.ఈడి కార్యక్రమంలో ప్రవేశం పొందడానికి కనీస అర్హత ఇంటర్మీడియట్ లో 50 శాతం లేని ఉపాధ్యాయులు కేంద్ర సార్వత్రిక పాఠశాల సంస్థలో చేరి కనీస అర్హత సాధించేందుకు ఇంటర్మీడియట్ పరీక్షకు తిరిగి హాజరవ్వాలని చెప్పారు. కేంద్ర నిబంధనల మేరకు నిర్ణీత సమయంలో ఈ శిక్షణ పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం కడియం తెలిపారు.

ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ లలో శిక్షణ పొందని ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నాం. వివరాలు వచ్చాక శిక్షణ పొందని వారందరికీ శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ లలో ఖాళీ అయిన ఉపాధ్యాయుల సీట్లను భర్తీ చేయడంపై 2004 నుంచి నిషేధం ఉంది. దీనిని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిషేధం ఎత్తివేసి ఖాళీ సీట్లను భర్తీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడానికి, విద్యార్థుల నమోదు పెంచడానికి గ్రామాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టామన్నారు. అవసరమున్న చోట రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో స్టూడెంట్ - టీచర్స్ నిష్పత్తి పాటిస్తున్నామని, ఈ నిష్పత్తి పాటిస్తేనే పాఠశాలలకు అనుమతి ఇస్తున్నామని వివరించారు.

2346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles