ఇద్దరు అంతర్రాష్ట దొంగలు అరెస్టు

Sat,January 12, 2019 10:18 PM

two interstate robbers were arrested

మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు దొంగల వివరాలు వెల్లడించారు. భూత్పూర్ మండలం గుబ్బెడి తండాకు చెందిన పాల్త్యావత్ మోహన్ నాయక్ రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా దొంగతనాలకు పాల్పడి అనేక సార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడని తెలిపారు. అయితే గత సెప్టెంబర్‌లో చర్లపలి జైలులో ఉన్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ శహబజ్‌తో పాల్త్యావత్ మోహన్ నాయక్‌కు పరిచయం ఏర్పడిందన్నారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. పాలమూరు దేవరకద్రతోపాటు వనపర్తి జిల్లా మదనాపూర్, ఆత్మకూరు ప్రాంతాలలో తాళం వేసి ఉంచిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలుపెట్టగా.. శనివారం దేవరకద్రలోని కురుమూర్తి కమాన్ వద్ద ఎస్ వెంకటేశ్వర్లు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులను అనుమానంతో ప్రశ్నించినట్లు తెలిపారు. ఎస్‌ఐ ప్రశ్నలకు వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి బయటపడిందన్నారు. పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని చెప్పారు. వారి నుంచి 90 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles