నకిలీ పత్తి విత్తన డీలర్లు అరెస్ట్

Wed,May 22, 2019 08:00 PM

two fake cotton seeds dealers arrested in rajanna sircilla dist

* టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో పట్టివేత
* 130 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం
* వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలతో పక్కా సమాచారంతో ఇద్దరు నకిలీ పత్తి విత్తన డీలర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్‌లో ఫర్టిలైజర్ దుకాణంలో పట్టుకుని, వారి నుంచి 130 నకిలీ పత్తి వితనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గాలిపాలెంకు చెందిన అట్ల శ్రీనివాసరెడ్డి(50) హైదరాబాద్‌లో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి, వేములవాడ ప్రాంతంలోని రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. శ్రీనివాసరెడ్డికి సహాయంగా వేములవాడ మండలం తిప్పాపూర్‌లోని కొమురవెల్లి శివుడు(47) భాగస్వామ్యంగా ఉన్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి 130 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కొనుగోలు చేసి, వేములవాడ మండలం తిప్పాపూర్‌లోని రాజరాజేశ్వరి ఫర్టిలైజర్ దుకాణంలో ఇరువురు సమావేశమయ్యారు.

నకిలీ పత్తి విత్తనాలను చుట్టు పక్కన ఉన్న గ్రామాల్లోని రైతులకు సరఫరా చేయడానికి సిద్ధం కాగా, పక్కా సమాచారంతో ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిని విచారించగా, నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు ఒప్పుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అక్రమ దందాలు, నకిలీ విత్తనాల విక్రయాల సమాచారం తెలిస్తే తమకు అందించాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

1832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles