పెద్దవాగు నీటిలో పడి అన్నదమ్ముల మృతి

Tue,December 3, 2019 09:12 PM

కోయిలకొండ : సోదరి పెళ్లి కోసం వచ్చి మరో రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లాల్సిన అన్నదమ్ములు విస్లావత్ ప్రవీణ్ (27) సంజయ్ (23) ప్రమాదవశాత్తు కోయిల్‌సాగర్ బ్యాక్ వాటర్ పెద్దవాగులో పడి మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని కళ్యాణ్‌నగర్‌తండాకు చెందిన విస్లావత్ రాందాస్‌నాయక్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తెలున్నారు.


రాందాస్‌నాయక్ గతంలో పనికోసం ఢిల్లీకి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. కూతురు సుమ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులంతా వారం రోజుల క్రితం ఢిల్లీ నుంచి కళ్యాణ్‌నగర్‌తండాకు వచ్చారు. ఈ నెల 1వ తేదీ కూతురును పెళ్లి చేశారు. కుటుంబ సభ్యులు తమ వరి ధాన్యాన్ని పెద్దవాగు బండపై ఆరవేయగా, వరిని బస్తాలో వేసేందుకు వెళ్లారు. సంజయ్, ప్రవీణ్‌లు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి వాగులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు.

వారికి ఈత రాకపోవడంతో నీటిలో మునుగుతుండగా వారిని కాపాడడానికి తల్లి అంజలిబాయి, బంధువులు డక్యానాయక్, ప్రకాశ్‌లు వెళ్లి నీటిలో దిగారు. వారు కూడా నీటిలో మునిగిపోతుండగా బహిర్భూమికి వెళ్లిన చిన్నరాజమూర్ గ్రామస్తుడు చిన్న బుచ్చన్న మునుగుతున్న వారిని చూశాడు. అంజలిబాయి చీర సహాయంతో ఆమెను, డక్యానాయక్, ప్రకాశ్‌ల ప్రాణాలు కాపాడాడు. ప్రవీణ్, సంజయ్‌లు నీటిలో మునిగిపోయారు. ప్రవీణ్ ఢిల్లీలో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా, సంజయ్ బీ ఫార్మసీ చదువుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.

577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles