'రేవంత్‌కు చావుదెబ్బ తప్పదు'

Sat,March 10, 2018 06:48 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో బడుగుల ఆశాజ్యోతి అయిన ఈటెల రాజేందర్‌ను విమర్శించే నైతిక అర్హత ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి లేదని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్‌గౌడ్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలు గురివింద గింజ చందంగా ఉన్నాయని మండిపడ్డారు.


ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిరణ్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీల నాయకత్వాన్ని ఓర్చుకోలేక ఈటెల రాజేందర్‌పై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ వ్యవహారశైలిని బడుగు, బలహీనవర్గాల ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో రేవంత్ కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యమే తలదించుకునేలా పట్టపగలే ఓటుకు నోటు కేసులో దొరికిన గజదొంగ రేవంత్‌కు నిజాయితీకి మారుపేరైన ఈటెలను విమర్శిస్తే పుట్టగతులుండవన్నారు. రేవంత్ వైఖరిని గమనిస్తుంటే మతిభ్రమించినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి బీసీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ సహించేదిలేదన్నారు. తక్షణమే రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితికి తమ పార్టీ నాయకులు దిగజారలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా చైతన్య యాత్రను ఒక చేవలేని, చేతగాని యాత్రగా అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకులు పసలేని విమర్శలు మానుకుని, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చూసి సిగ్గుతెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థి, నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు శ్రీకాంత్‌మాదిగ, శివాజీ, శ్రీమన్, సాయి, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

7369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles