కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోల్లో టీఆర్‌ఎస్‌ పథకాలే ఉన్నాయి..

Mon,April 8, 2019 04:10 PM

TRS Working President KTR fire on BJP and Congress Politics

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రశంసలు పొందిన పథకాలనే.. నేడు కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు తమ మేనిఫెస్టోలలో పెట్టుకున్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎల్బీనగర్‌ పరిధిలోని మన్సురాబాద్‌ డివిజన్‌లో మన హైదరాబాద్‌.. మనందరి హైదరాబాద్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గడిచిన ఐదేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఏడాది జూన్‌ 2 వస్తే తెలంగాణ ఏర్పడి ఐదేండ్లు అవుతుంది. ఒక నాడు భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌ గురించి చెప్పేవారు. తర్వాత గుజరాత్‌ మోడల్‌ గురించి విస్తృతంగా చర్చ జరిగేది. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఐదేళ్ల స్వల్ప కాలంలోనే దేశంలో మన రాష్ట్రం గురించి చర్చ జరుగుతుంది.

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ సహా 8 రాష్ర్టాలు రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి అమలు చేస్తున్నాయి. పొద్దున్నే లేస్తే సీఎం కేసీఆర్‌ మీద దుమ్మెత్తి పోసే చంద్రబాబు అన్నదాత సుఖీభవ పేరిట రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అక్కడి రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారంటే అది కేసీఆర్‌ పుణ్యమే. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్‌ పథకానికి ప్రేరణ రైతుబంధు పథకం అని చెప్పక తప్పదు. దేశంలోని ఆయా రాష్ర్టాలకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఇవాళ విడుదలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మేనిఫెస్టోలలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కనబడుతున్నాయి. మన పథకాలను జాతీయ పార్టీలు కాపీ కొడుతున్నాయి.

తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో భయంకరమైన విద్యుత్‌ కోతలుండేవి. చిన్న చిన్న పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ఇందిరా పార్క్‌ వద్ద చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం. ఎల్బీనగర్‌తో పాటు విలీన మున్సిపాలిటీల పరిధిలో నీటి సమస్యను అధిగమించాం.

శాంతిభద్రతల విషయంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్‌లో కనీసం నాలుగైదు రోజులు కర్ఫ్యూ ఉండేది. గడిచిన ఐదేండ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ విధించలేదు. శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేస్తున్నాం. శాంతిభ్రదతల సమస్య లేనందు వల్లే నేడు రాష్ర్టానికి అనేక పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్‌ ప్రజలకు నాణ్యమైన రవాణాను అందిస్తున్నాం. ఎల్బీనగర్‌ పరిధిలో రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. త్వరలోనే ఎల్బీనగర్‌లో రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరిస్తాం. ఇది పని చేసే ప్రభుత్వం.. మాటల వరకే మాట్లాడం.. మెట్రోను పొడిగిస్తాం. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తాం. ఇప్పటికే మెట్రో 56 కిలోమీటర్లు పూర్తయింది. మరో 16 కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉంది. భవిష్యత్‌లో మెట్రో 200 కిలోమీటర్ల వరకు విస్తరించాలి. ఇందుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముంబైలో మెట్రో విస్తరణకు కేంద్రం రూ. 18 వేల కోట్ల నిధులు ఇచ్చింది. హైదరాబాద్‌ మెట్రోను కేంద్రం పట్టించుకోలేదు.

2014లో నరేంద్ర మోదీ ప్రభావం బలంగా ఉండేది. కాబట్టి 283 సీట్లతో సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి కట్టబెట్టారు. ఇప్పుడు మోదీపై దేశ ప్రజలకు నమ్మకం పోయింది. బీజేపీకి 150 సీట్లు, కాంగ్రెస్‌ 100 సీట్లు దాటే పరిస్థితి లేదని మీడియా సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఒక్కొక్క ఎంపీ కూడా కీలకం అవుతారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు గెలిస్తే.. రాహుల్‌, మోదీ చెప్పినట్లు వినాలి. మన టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే.. రాష్ర్టానికి రావాల్సిన నిధులను కొట్లాడి తెచ్చుకోవచ్చు. కేంద్రంలో నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే.. మెట్రోకు నిధులు తెచ్చుకోవచ్చు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంట్‌ ఎన్నికల్లో వస్తాయని విశ్వసిస్తున్నాం. మన పథకాలన్నింటిని కేంద్రం ప్రశంసించింది. కానీ మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే నరేంద్ర మోదీ రూ. 24 పైసలు కూడా ఇవ్వలేదు అని కేటీఆర్‌ మండిపడ్డారు.

1131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles