చేవెళ్ల లోక్‌సభ స్థానంలో గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్

Tue,March 19, 2019 09:20 PM

TRS will win in Chevella lok sabha constitution says ktr

రంగారెడ్డి: చేవెళ్ల లోక్‌సభ స్థానంలో గులాబీ జెండా ఎగరాలని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శంషాబాద్‌లో నేడు జరిగిన టీఆర్‌ఎస్ బహరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల శంషాబాద్ వద్ద ఎయిర్‌పోర్టు సిటీకి శంకుస్థాపన జరిగిందన్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ చేపడుతున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఆధునికంగా మారబోతుందన్నారు. ఉస్మాన్‌సాగర్ చెరువుకు వందేళ్లు నిండబోతున్నాయని చెప్పారు. చెరువును రూ. 100 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. కృష్ణా నీళ్లతో రంగారెడ్డి జిల్లా రైతుల కాళ్లు కడుగుతామన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా చూస్తామన్నారు. గ్రామాల్లో సాగునీరు ఇచ్చి పంటలను సస్యశ్యామలం చేస్తామన్నారు.

కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన కొనుగోలు చేస్తున్నట్లు విమర్శిస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకులకు రాహుల్‌గాంధీ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారు. ప్రజాప్రతినిధులంటే చులకన భావన వచ్చేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు బంధు పేరు మార్చి ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం తెచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రమంతటా కేసీఆర్ పవనాలు ఉన్నాయన్నారు. సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు పేరుతో ముందుకెళ్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. 83 గ్రామాల ప్రజల సమస్యను తీర్చేలా త్వరలో జీవో 111 రద్దు చేస్తామన్నారు. పర్యావరణ హితంగా జీవో 111 రద్దుకు కార్యచరణ సిద్ధమైందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో శంషాబాద్‌కు మెట్రో రైలు, శంకర్‌పల్లి వరకు ఎంఎంటీఎస్ తీసుకొస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఒక్కో పార్లమెంట్ సభ్యుడు చాలా కీలకమన్నారు. రాష్ట్రంలో 16 మంది టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యులను గెలిపించాలన్నారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఎవరు ఎగరేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.

2409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles