మరో పదేళ్లు టీఆర్‌ఎస్‌దే అధికారం

Fri,November 8, 2019 07:46 PM

రెడ్డి కాలనీ(వరంగల్): రాష్ట్రంలో మరో పదేళ్ల పాటు టీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం హన్మకొండలో టీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్‌స్థాయి కమిటీలపై, డివిజన్ స్థాయి కమిటీలపై నియోజకవర్గ స్థాయి కమిటీలపై చర్చించారు. అనంతరం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని, పార్టీ వారికి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు.


సంక్షేమ పథకాలకు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు 237 బూత్‌కమిటీల్లో ఆదివారం జెండాలు రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, వ్యవసాయానికి 24 గంటలు కరంట్ అందించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. అనంతరం హన్మకొండకు చెందిన పలువురు కాంగ్రెస్ నగర నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

1088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles