సంకీర్ణమే.. ప్రాంతీయ పార్టీలే కీలకం : ఎంపీ కవిత

Fri,March 15, 2019 01:22 PM

TRS Party will play key role in National politics says MP Kavitha

నిజామాబాద్ : ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడే అవకాశం ఉంది. కనుక ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని, ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని లక్షలాది మంది తరలివచ్చి.. విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ప్రజలందరూ కూడా నేషనల్ పార్టీలు కాదు.. గ్లోబల్ పార్టీలు ఉండాలని కోరుకుంటున్నారు. పార్టీలకు అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించే దృక్పథం ఉండాలి. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రధానమైన అంశం.. తెలంగాణ ప్రజల సమస్యలు, అభివృద్ధి. జాతీయ పార్టీలు తెలంగాణ సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. ప్రాంతీయ పార్టీలే వల్లే రాష్ర్టాల్లో అభివృద్ధి సాధ్యమవుతోంది. భారీ స్థాయిలో ఎంపీలను అందరిని గెలిపించాలి. ఢిల్లీలో మన స్వరాన్ని వినిపించేలా అవకాశం కల్పిస్తే మన సమస్యలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఎంపీలందరూ రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ముందుండి పోరాడినం. విభజన సమస్యలను పరిష్కరించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం తనంతట తాను ముందుకు వచ్చి ఏ సమస్యను కూడా పరిష్కరించలేదు. కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చుకునే సత్తా టీఆర్‌ఎస్ పార్టీకి, ఎంపీలకు ఉందన్నారు.

తెలంగాణ సాధించుకోవడం కోసం కేసీఆర్ ఎంత చిత్తశుద్దితో పని చేశారో.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అంతే చిత్తశుద్ధితో టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంతో పోరాడి సమస్యలను పరిష్కరించారు. 16 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులను, ఒక ఎంఐఎం అభ్యర్థిని గెలిపిస్తే 17 మంది సైనికులం పార్లమెంట్‌లో ఉంటాం. లోక్‌సభలో ముందుండి కొట్లాడి మన హక్కులను సాధించుకుంటాం. కాంగ్రెస్, బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మనం కీలకం అవుతామని కవిత చెప్పారు. తెలంగాణ హక్కులను సాధించుకోవడమే కాకుండా.. దేశ రాజకీయాల్లో మార్పు కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉందన్నారు. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారు. మన నాయకుడి వద్ద ఒక విజన్, దూరదృష్టి, దార్శనికత ఉందన్నారు. మంచి నాయకుడు, గొప్ప ఆలోచన ఉంటే.. దేశానికే దిశానిర్దేశం చేయొచ్చు అని ఎంపీ కవిత పేర్కొన్నారు.

1593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles