ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు..

Thu,October 11, 2018 12:38 PM

TRS MLC Karne Prabhaker fire on Telangana TDP Leaders

హైదరాబాద్ : టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి హరీశ్ రావు.. చంద్రబాబుకు సంధించిన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఇవాళ కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. 12 ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేదన్నారు. విభజన తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, హైకోర్టు విభజన కావొచ్చు.. వీటితో పాటు అనేక ఇబ్బందులున్నాయి. వీటిపై వైఖరి ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. కానీ టీడీపీ నేతల నుంచి మాత్రం సమాధానం రావడం లేదు. అసంబద్ద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నదీ జలాలపై అవగాహన లేదు. ఉత్తమ్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ప్రాణాలకు తెగించిన వ్యక్తి కేసీఆర్. ప్రజల పక్షపాతిగా తాము మాట్లాడుతున్నాం. చాలా సందర్భాల్లో బాబు చేసిన కుట్రలను బయటపెట్టాం. ఒంటరిగా వచ్చినా.. కుట్రలు, కూటమితో వచ్చినా.. తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కూటమే కుతంత్రాల కూటమి. తెలంగాణ హక్కులను ఏపీకి అప్పజెప్పేందుకే కూటమి. ఈ ప్రయత్నంలో భాగమే ఈ ఒప్పందం అని అన్నారు. నాడు కాంగ్రెస్ నేతలు.. ఏపీ కాంగ్రెస్ నేతల మోచేతి నీళ్లు తాగారు.. నేడు అమరావతి బాసులకు బానిసలుగా మారబోతున్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కేంద్రానికి బాబు అనేక ఉత్తరాలు రాశారు. సీలేరు ప్రాజెక్టును అప్పన్నంగా లాక్కున్నారు. తెలంగాణను సర్వనాశనం చేసింది గత పాలకులే. టీఆర్‌ఎస్‌కు ప్రజల దీవేనలు ఉన్నాయి. కుట్రలను తిప్పికొట్టే శక్తి తమకు ఉందన్నారు కర్నె ప్రభాకర్.

1531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles