బీజేపీలో చేరే ఆలోచన, అవసరం లేదు

Mon,July 1, 2019 02:12 PM

TRS MLC Kadiyam Srihari denies Media reports about joining in BJP

హైదరాబాద్‌ : తనకు బీజేపీలో చేరే ఆలోచన కానీ, అవసరం కానీ లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బీజేపీలో చేరుతున్నానని తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన కొన్ని మీడియా సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సత్యదూరమైన వార్తలను ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా ప్రచురించడం సరికాదన్నారు. డెక్కన్‌ క్రానికల్‌, హెచ్‌ఎంటీవీ, మహా న్యూస్‌ సంస్థలు క్షమాపణలు చెప్పని పక్షంలో న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేస్తూ కడియం శ్రీహరి బహిరంగ లేఖ విడుదల చేశారు.

నేను సమాజంలో అట్టడుగు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఉన్నతవిద్య చదివి లెక్చరర్ గా పనిచేస్తున్న కాలంలోనే నాకు రాజకీయ అవకాశాలు వచ్చాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాను. వాటికి వన్నె తెచ్చాను. రాజకీయాల్లో అనేక అద్భుత సందర్భాలను, క్లిష్టకాలాలను మరియు ఒడిదుడికులను చూసిన వాడిని.

ఎదుగుతున్న దళిత నాయకత్వాన్ని బలహీనపర్చి, బదనాం చేసే కుట్రలో భాగంగా కొన్ని స్వార్థపర శక్తులు వారి వ్యక్తిత్వాన్ని, అవకాశాలను దెబ్బతీసేవిధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తుంటాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా మరియు ఇప్పుడు పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. దీనిని గమనించాల్సిందిగా ప్రజలను, మీడియాను కోరుతున్నాను.

ఒకే ఒక్క మాట..
రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారాల్సిన అవసరం కానీ, పదవుల కోసం పాకులాడాల్సిన పరిస్థితి కానీ నాకు లేదు. అవినీతి, అక్రమాలను పెంచి పోషించి, విలువలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీకి నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏనాడు ఓటు వేయలేదు.

నేను అంబేద్కర్ వాదిని. వామపక్ష భావజాలంతో పెరిగిన వ్యక్తిని. కులం, మతం ఆధారంగా రాజకీయం చేసే పార్టీలకు దూరంగా ఉండే వ్యక్తిని. అందులోనూ దళిత, ముస్లిం మరియు క్రైస్తవ వ్యతిరేకమైన, సిద్ధాంతపరంగా విబేధించే బిజిపిలోకి వెళ్లే దుస్థితి లేనే లేదు.

యావత్తు తెలంగాణ ప్రజానీకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మద్దతు తెలుపుతున్నారు. దేశం మొత్తం కేసిఆర్ గారి వైపు చూస్తోంది. కేసిఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా నిలవబోతోంది. కేసిఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో నావంతు బాధ్యతను నిర్వర్తిస్తాను అని కడియం శ్రీహరి లేఖలో పేర్కొన్నారు.

5291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles