రేవంత్‌ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్ట్‌ : ఎమ్మెల్యే బాల్క

Wed,May 1, 2019 12:45 PM

TRS MLA Balka Suman alleges Revanth reddy is Political Terrorist

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రేవంత్‌ రెడ్డిపై చెన్నూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో దొర్లిన తప్పుల విషయంలో రేవంత్‌ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్ట్‌.. రాష్ట్రంలో ఒక శాడిస్టుగా మారాడని సుమన్‌ ధ్వజమెత్తారు. రేవంత్‌ రెడ్డి శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడి పెడుతడు. మోకాలికి, బొడిగుండుకు ముడిపెడుతడు. ఇంటర్మీడియట్‌ బోర్డు అంశంలో గ్లోబరినా సంస్థకు అవకాశం ఎలా వచ్చిందని రేవంత్‌ అడుగుతున్నాడు.

ఇంటర్మీడియట్‌ బోర్డు 25-09-2017 నాడు టెండర్‌ పిలిస్తే ఎల్‌1 సంస్థగా గ్లోబరినా సంస్థ వచ్చింది. 27-09-2017న టెండర్‌ ఫైనల్‌ అయింది. ఆ మొత్తం కాంట్రాక్ట్‌ వాల్యూమ్‌ కూడా రూ. 4 కోట్ల 35 లక్షల 70 వేలు మాత్రమే. అయితే ఈ కాంట్రాక్ట్‌ మూడేండ్ల వరకే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రాసెస్‌ను మొత్తం ఇంటర్మీడియట్‌ బోర్డుకు అప్పజెప్పి వెళ్లిపోవాలి. ఇది పూర్తిగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో ఐటీ డిపార్ట్‌మెంట్‌కు ఏం సంబంధం? అని రేవంత్‌ను సుమన్‌ ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్నోడో ఎవడైనా మాట్లాడే మాటలేనా? ఆనాడు ఐటీ మినిస్టర్‌గా ఉన్న కేటీఆర్‌కు దీన్ని అంటగట్టి.. వందల కోట్ల అవినీతి, వేల కోట్ల దోపిడీ జరిగిందని అంటున్నాడు. ఈ బుడ్డెరఖాన్‌ మాట్లాడే తీరు చూస్తుంటే.. ఈయనను రాజకీయ టెర్రరిస్టు అనకపోతే ఇంకేమనాలి? అని ప్రశ్నించారు.

ఈ మూడేళ్లలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను చూస్తే.. 2017, మార్చిలో 8,90,087 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. 61.34 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2018, మార్చిలో 8,85,167 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. 64.73 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2019 మార్చిలో 8,70,924 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. 62.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతంలో ఎక్కడా కూడా పెద్ద వ్యత్యాసం లేదు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జరిగిన పొరపాట్లను 24 గంటల్లోనే సరిచేశారు.

అడ్డగోలు ఆరోపణలు చేయడం సరికాదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పార్టీలు, నాయకులు.. బాధ్యతను విస్మరించి మాట్లాడటం సరికాదు. రేవంత్‌ రెడ్డి నోటికి అదుపు లేదు. రాష్ట్రంలో ఒక శాడిస్ట్‌గా మారాడు. కొడంగల్‌లో ఓడిపోయినప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. ప్రజల కోసం ఆయన ఏనాడు మాట్లాడలేదు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను 24 గంటల్లో రేవంత్‌ రెడ్డి వెనక్కి తీసుకోవాలి అని సుమన్‌ డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి తప్పులు చేసిన అధికారులపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పష్టం చేశారు.

ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి జాగ్రత్తగా మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు.. అపోహాలు సృష్టించి.. అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. విపక్షాలు రాజకీయ ఉన్మాద రాజకీయంతో వ్యవహరిస్తున్నాయి. ఇటువంటి ప్రతిపక్షాలు భారతదేశంలో ఎక్కడా లేవు. తప్పులను వెంటనే సరిదిద్దుతూ విద్యార్థుల్లో భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి సమీక్ష నిర్వహించి.. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని స్వయంగా చెప్పారు. రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఉచితంగా చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. విద్యార్థుల వయసు, వారి తల్లిదండ్రుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటుంది. కొన్ని పార్టీల నాయకులు అడ్డగోలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ధ్వజమెత్తారు.

2356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles