జానారెడ్డి తీరుపై టీఆర్‌ఎస్, బీజేపీ ఫైర్

Tue,November 14, 2017 01:15 PM

TRS and BJP MLAs fire on Congress MLA Janareddy

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి తీరుపై టీఆర్‌ఎస్, బీజేసీ సభ్యులు మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంగా.. జానారెడ్డి అడ్డుకున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా.. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు జయంతిపై చర్చ చేపట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీష్‌రావు నిరాకరించారు.

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు : డిప్యూటీ సీఎం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై జరుగుతున్న చర్చను కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవడం సరికాదని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సభలో చర్చ జరిగిన విషయాలపై వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు.. ఇక్కడే అర్థమవుతుంది కాంగ్రెస్ చిత్తశుద్ధి అని కడియం తెలిపారు. శాసనసభలో ఎప్పుడైనా మహనీయుల జయంతి ఉత్సవాలపై చర్చలు జరిగిన దాఖలాలు ఉన్నాయా? అని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి కడియం ప్రశ్నించారు. జయంతి ఉత్సవాలపై చర్చ చేపట్టాలని ఎలాంటి ఆదేశాల్లేవని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. కేవలం సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అతి ముఖ్యమైన చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ అడ్డుపడటం సరికాదని కడియం పేర్కొన్నారు.

నిరసన చేపడితే అర్థం ఉండాలి : హరీష్‌రావు
బాలల దినోత్సవం రోజున తెలంగాణ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారికి విద్యాఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం చేపడితే.. కాంగ్రెస్ దాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు మంత్రి హరీష్‌రావు. సభలో ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయాన్ని తేవడం ఎంత వరకు సమంజసం అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల మీద గతంలో ఎన్నడూ చర్చ చేపట్టలేదని మంత్రి గుర్తు చేశారు. నిరసన తెలిపితే అర్థం ఉండాలన్నారు. ఎజెండాలో లేని అంశంపై నిరసన తెలపడం సరికాదన్నారు. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి. బయటనేమో ఉద్యోగాలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తారు.. తీరా చర్చ చేపడితే అడ్డుకుంటారని మంత్రి కోపోద్రిక్తులయ్యారు. సభలో చర్చకు సహకరించి మీ అభిప్రాయాలను చెప్పాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే అక్కసుతోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చకు కాంగ్రెస్ అడ్డుపడుతుందని హరీష్‌రావు పేర్కొన్నారు.

చర్చ జరగడం ఇష్టం లేదా? : లక్ష్మణ్
ఇక బీజేపీ సభ్యులు లక్ష్మణ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై లక్ష్మణ్ కోపం చేశారు. నిరుద్యోగ సమస్యపై చర్చ జరగడం మీకిష్టం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఇటీవలే మీరు వాయిదా తీర్మానం ఇచ్చి.. ఇప్పుడు దానిపై చర్చ జరుగుతుంటే.. అడ్డుకోవడం ఏంటని లక్ష్మణ్.. జానారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

4889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS