ఉచిత శిక్షణ.. ఉపాధికి భరోసా

Sun,July 2, 2017 07:18 AM

Training and job placements on behalf of Varalaxmi foundation

రంగారెడ్డి : ఆకలితో ఉన్న వాడికి భోజనం పెట్టడం కంటే, ఆ భోజనం ఎలా సమకూర్చుకోవాలో నేర్పడం మంచిది అనే నానుడిని చేతల్లో చూపిస్తోంది శ్రీ వరలక్ష్మి ఫౌండేషన్ (సీఎస్‌ఆర్). శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ భాగస్వామ్య సంస్థ అయిన ఈ ఫౌండేషన్ 2007లో ప్రారంభమైంది.. దశాబ్ద కాలంగా సుమారు 7,500 మంది యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రతిఏటా దాదాపు 800 మంది ఉచిత శిక్షణ పొందుతున్నారు. అలా శిక్షణ పొందిన వారిలో కొందరు స్వయంగా ఉపాధి కల్పించుకుంటున్నారు. మరికొందరు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. పదో తరగతి/ఇంటర్మీడియట్ చదువుకున్న వారికి ఉద్యోగం దొరకాలంటే కష్టమే. దొరికినా చాలా తక్కువ వేతనం ఇస్తారు. అదీ అందరికి అసాధ్యం. పదో తరగతి/ఇంటర్ వరకూ చదివి, ఉత్తీర్ణులైనా, కాకపోయినా కొద్దిపాటి శిక్షణ తీసుకుంటే చాలు. హైదరాబాద్‌లోని వివిధ షాపింగ్ మాళ్లు, కంపెనీలు, ఐటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తుండటం పేద యువతీ యువకులకు ఉపయుక్తంగా ఉంటోంది

ఎయిర్‌పోర్టు పరిసరాలతో పాటు పలువురికి..
తమ కాంట్రాక్టు ప్రాజెక్టు ఎయిర్‌పోర్టు పరిసరాలలోని గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలలో సామాజిక అభివృద్ధి, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి అంశాలలో తమ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ప్రధానంగా శంషాబాద్, మామిడిపల్లి, తొండుపల్లి, తుక్కుగూడ, మంకాల్, కొత్వాల్‌గూడ, చిన్నగోల్కొండ, గొల్లపల్లి, పెద్దగోల్కొండతో పాటు శంషాబాద్ మండలంలోని గ్రామాలు, ఇతర పరిసర గ్రామాలలో యువత కూడ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. అదే విధంగా రెండు తెలుగు రాష్ర్టాల యువతకు కూడ ఇక్కడ శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నారు.
అంతా ఉచితమే..
శిక్షణ పూర్తి ఉచితం.వసతి, ఆహారం ఇవ్వడమే కాకుండా యూనిఫామ్, కోర్సుకు సంబంధించి పుస్తకాలు,పరికరాలు ఇస్తారు. మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవాలి. తర్వాత సంస్థ ప్రతినిధులే వీరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటారు. ఉద్యోగులు కావాల్సిన సంస్థల జాబితా నిర్వాహకుల దగ్గర ఉంటుంది. వీరు ఆయా జాబితాలోని సంస్థలను సంప్రదించి తమ వద్ద శిక్షణ పొందిన వారి వివరాలు ఇచ్చి ఉద్యోగం ఇప్పించేందుకు సహకరిస్తారు.
కేంద్రం సహాయంతో..
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్‌యోజన కింద యువతకు నైపుణ్య అభివృద్దిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం గత నెలలో ఈ ఫౌండేషన్‌లో ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా సంస్థ ద్వారానే శిక్షణ ఇచ్చారు. ఒక యువకుడు ఏడు/పది చదివితే ఉపాధి పొందడం కష్టం. అదే యువకుడికి ప్లంబరింగ్‌లోనో.. ఎలక్ట్రిషియన్‌గానో శిక్షణ ఇస్తే ఏదో ఒక పరిశ్రమలో ఉపాధి పొందేందుకు వీలుంటుంది. అదేవిధంగా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారతి ట్రస్టు భాగస్వామ్యంతో పలువురు నిరుద్యోగ యువతకు ఆయా వృత్తి కోర్సులలో ఉచితంగా శిక్షణ, ఉపాధి, ఉద్యోగావకాశాలు ఇప్పిస్తున్నారు
మహిళలకు ఉపాధి..
ఎయిర్‌పోర్టు పరిసర గ్రామాలలోని మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి జూట్, పేపర్ తయారీ నేర్పి స్వయం ఉపాధి కల్పిస్తున్నారు.ఇప్పటి వరకు సుమారు రూ.71 లక్షల టర్నోవర్ వ్యాపారం నిర్వహించారు. బ్యాగుల తయారీ, ఇతర పలు రకాల గృహాలంకరణ వస్తువులు తయారుచేసి మన దేశంతో పాటు ఇతర దేశాలలో జరిగే సదస్సులు,ఇతర కార్యక్రమాలలో అమ్మకాలు చేస్తున్నారు. విదేశీయులను కూడా ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సృజన మహిళా అభివృద్ది సొసైటి పేరుతో మహిళలు గ్రూపుగా ఏర్పడి ఈ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఎందరికో వైద్యం..
ఎయిర్‌పోర్టు పరిసరాలలోని సుమారు 21 గ్రామాల పరిధిలో ప్రతివారం దాదాపు 800 మందికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అదే విధంగా ఎయిర్‌పోర్టు కాలనీలో సుమారు 250 కుటుంబాలకు ఉచిత మంచి నీటిసరఫరా సదుపాయం కల్పించారు. కాలనీలోని పాఠశాలతో పాటు మండలంలోని పలుగ్రామాలలో గ్రామీణ పాఠశాలలకు ఉచిత పౌష్టికాహార పదార్థాల పంపిణీ చేయడంతో పాటు, పాఠశాలలకు అవసరమైన వస్తుసామగ్రి అందజేస్తున్నారు.

అన్ని వర్గాల అభ్యున్నతే జీఎంఆర్ సంస్థ లక్ష్యం: -మీనా రఘునందన్, డైరెక్టర్, కమ్యూనిటీ సర్వీసెస్, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్
అన్ని వర్గాల అభ్యున్నతి సాధించడమే జీఎంఆర్ ప్రధానాశయం. గ్రామీణవికాసం కార్పొరేట్ సంస్థల ప్రథమ కర్తవ్యం.మా సంస్థ ద్వారా నిర్దిష్ట ప్రణాళికతో ఆ దిశగా కృషి చేస్తున్నాము.మేము అందించే సేవలను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు.నిరుద్యోగయువతకు ఉద్యోగ,ఉపాధి కల్పిస్తున్నాం. మహిళలకు స్వయం ఉపాధితో ఆర్థిక సాధికారత సాధ్యమవుతుంది.భవిష్యత్‌లో సమిష్టి భాగస్వామ్యంతో మరింత పురోభివృద్ధితో ముందుకు సాగుతాము.

2028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles