సిద్దిపేట : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలిక పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన టిఫిన్ - ట్యూషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థినులందరికీ సాయంత్రం సమయంలో టిఫిన్ - ట్యూషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సాయంత్రం పాఠశాలలోనే టిఫిన్ చేసి.. చదువుకోవాలని చెప్పారు. పది ఫలితాల్లో సిద్దిపేట రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు. దిశపై జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందన్నారు హరీష్ రావు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలన్న మంత్రి.. మగ పిల్లలకు సంస్కారంతో కూడిన విద్యను అందించాలని సూచించారు. తల్లిదండ్రులు ఆడ పిల్లలపై కంటే మగ పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. మగపిల్లలు ఏం చేస్తున్నారన్న విషయంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షిస్తుండాలని మంత్రి సూచించారు. టీవీ సీరియల్స్, మొబైల్ ఫోన్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
