ఇది తెలంగాణ పోలీసులందరికీ దక్కిన గౌరవంTue,November 14, 2017 10:58 PM

ఇది తెలంగాణ పోలీసులందరికీ దక్కిన గౌరవం

తనకు జరిగిన ఆత్మీయ వీడ్కోలుకు అనురాగ్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ డీజీపీకి కూడా ఇంతటి స్థాయిలో వీడ్కోలు జరగలేదని, ఇది తనొక్కడికే కాకుండా తెలంగాణ పోలీస్‌శాఖకు జరిగిన సన్మానంగా భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో నన్ను పిలిచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి మాట ప్రకారం..ఇతర పోలీసు అధికారులందరి సహకారంతో మూడున్నరేళ్లపాటు విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తిగా, సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ విజన్ చాలా గొప్పదని, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర సలహాదారుడిగా తన శక్తి మేరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

తనను సలహాదారుడిగా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు అనురాగ్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మాట్లాడుతూ, ఈ మూడున్నరేండ్లుగా రాష్ట్ర ప్రజలంతా ప్రతి రోజు ఎంతో భరోసా నిద్రపోయారంటే అందుకు పోలీసుశాఖ ఇస్తున్న భరోసానే కారణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల స్థాపన, పోలీస్‌శాఖ పటిష్టం చేయడంలో తొలి డీజీపీ అనురాగ్‌శర్మ సేవలు మరువలేనివన్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్‌శర్మ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడంలో డీజీపీగా అనురాగ్‌శర్మ ఉత్తమ పనితీరు కనబర్చారన్నారు. సీఎం కేసీఆర్ విజన్‌కు తగ్గట్టుగా పోలీస్ శాఖ పనితీరులోనూ ఎన్నో మార్పులు తెచ్చారన్నారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే శాంతియుత, నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దడంలో డీజీపీ అనురాగ్‌శర్మ కృషి ఎంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్‌శాఖకు ఇస్తున్న ప్రోత్సాహంతోనే జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్‌శాఖ నంబర్‌వన్ స్థానంలో నిలుస్తోందన్నారు. తనకు రాష్ట్ర డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తొలి డీజీపీగా అనురాగ్‌శర్మ తెచ్చిన ప్రమాణాలు కొనసాగిస్తూ, శాంతిభద్రతలతో తెలంగాణ రాష్ట్ర సుభిక్షంగా ఉండేలా కృషి చేస్తానని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కాగా, అనురాగ్‌శర్మకు పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. పలువురు మంత్రులు, పోలీస్‌శాఖ అన్ని విభాగాల అధిపతులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు అనురాగ్‌శర్మను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

1187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS