మూడోరోజు వైభవంగా తెలుగు మహాసభలు

Sun,December 17, 2017 11:15 PM

Third day telugu conference Success


హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు మూడో రోజు హైదరాబాద్ లోని అన్ని వేదికలు సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. నేడు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో మౌఖిక వాజ్ఞ్మయ భాషపై సభ జరిగింది. సభాధ్యక్షులుగా దేవులపల్లి ప్రభాకర్ రావు వ్యవహరించగా, ముఖ్య అతిథిగా శాసనమండలి అధ్యక్షులు స్వామిగౌడ్, గౌరవ అతిథిగా ద్వానా శాస్త్రి హాజరయ్యారు. ద్వానా శాస్త్రి రచించిన తెలంగాణ ప్రాచీన సాహిత్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

గతంలో తెలంగాణ అనే పదాన్ని అనొద్దని వాదించేవారని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గుర్తుచేశారు. దళిత వర్గాల నుండి ఎక్కువమంది కవులు వచ్చారని వివరించారు. తెచ్చుకున్న తెలంగాణను బాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని కొనియాడారు. మన తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసేందుకే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు మహాసభల కోసం విదేశాలనుండి వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. అమ్మ భాషను అందరూ ఆదరించాలని నాయిని కోరారు.

తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలను నిర్వహిస్తున్నారని తెలంగాణ శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాహిత్యానికి పూర్వ వైభవం వచ్చేలా, మరుగున పడిన కవులకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో అశోకుడు చెట్లు నాటితే.. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాత్రమే హరితహారం కార్యక్రమం చేపట్టారని గుర్తుచేశారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని వివరించారు. కాకతీయులు చెరువులు తవ్వితే.. వాటిని పునరుద్ధరించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దన్నారు. అన్ని భాషలను నేర్చుకోవాలి.. కానీ మాతృ భాషను మర్చిపోవద్దని సూచించారు.

అనంతరం గోరటి వెంకన్న రచించిన “గోరటి వెంకన్న కవితా పరామర్శ” పుస్తకాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, శాసన మండలి అధ్యక్షులు స్వామిగౌడ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆవిష్కరించారు.

1716
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS