కొండగట్టు ప్రమాదం.. కెపాసిటీ 40 సీట్లే.. ఎక్కింది 86 మంది..

Tue,September 11, 2018 03:09 PM

there were 86 passengers when the kondagattu accident occurred

జగిత్యాల : కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు ప్రయాణికులతో కొండగట్టు నుంచి జగిత్యాలకు బయల్దేరింది. కొండగట్టు ఘాట్‌రోడ్డు చివరలో బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంపై రెండు రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతోనే ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 86 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగే సమయానికి 86 మంది ప్రయాణికులకు టికెట్లు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆర్డినరీ బస్సు సీట్ల సామర్థ్యం 40 మాత్రమే. దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడంతో.. బస్సు ఓ పక్కకు ఒరిగి పోవడంతోనే రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో ఒకరి మీద మరొకరు పడటంతో ఊపిరాడక అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 45 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఇక జగిత్యాల ఆస్పత్రిలో 15 మంది, కరీంనగర్ ఆస్ప్రతిలో 14 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 35 మందిని గుర్తించారు పోలీసులు.

4685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS