Telangana Intermediate 1st & 2nd Year Results 2019

రాజకీయ పార్టీల పని కాదది: కేసీఆర్

Tue,March 19, 2019 08:34 PM

That's not the political parties work says cm kcr on Ramjanmabhumi dispute

నిజామాబాద్: బీజేపీది రాజకీయ హిందుత్వమైతే తమది నిజమైన హిందుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రామజన్మభూమి ఎవరిదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కావని సీఎం అన్నారు. నిజామాబాద్ టీఆర్‌ఎస్ పార్లమెంటరీస్థాయి నియోజకవర్గ సన్నాహక బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్న వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నన్నో మాట అడిగిండు. కేసీఆర్ నీవు కూడా హిందూవే అంటున్నవ్‌గా.. రామజన్మ భూమి మీద నీ స్టాండ్ ఎందీ అని అడిగిండు. నేనొక మాట అడుగుతున్న లక్ష్మణ్‌గారు మీది రాజకీయ పార్టీయా? ప్రజల కోసం పనిచేసే పార్టీయా? లేకపోతే మత ప్రచారం చేసే పార్టీయా? ఆ స్టాండు ఫస్ట్ నీవు చెప్పు. ఆ తర్వాత నేను చెబుతా. రామ జన్మభూమి-రావణ జన్మభూమి.. శ్రీకృష్ణ జన్మభూమి-కంస జన్మభూమి.. దుర్యోధన జన్మభూమి.. ఇగ సత్యభామ జన్మభూమి, సూర్పణక జన్మభూమి.. ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయల్నా? ఏ జన్మభూమి ఎవల్దో, ఎది ఎక్కడ ఉండాల్నో ఎవరు నిర్ణయించాలి? శృంగేరి పీఠంలో జగద్గురువులు, చినజీయర్ స్వామి ఉన్నడు, పీఠాధిపతులు ఉన్నరు, ధర్మప్రచారకర్తలు ఉన్నరు, మఠాలు ఉన్నయి, మతాధిపతులు ఉన్నరు. వాళ్లు చేయాలి. మన రాజకీయ నాయకులు పనికాదు అది. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి. రైతులకు నీళ్లు తేవాలి. రైతులకు కరెంటు తేవాలి. ప్రజల బాధలు పొగొట్టాలి. ఈ జన్మభూములు పనికిమాలిన సిద్ధాంతాలు చెప్పి.. పనికిమాలిన కథ మీరు చేస్తున్నరు. జన్మభూమి ఎవల్ది అనే పంచాయితీలు తెంపుడు కాదు రాజకీయపార్టీల పని. ప్రధానమంత్రుల పనికాదు. అంత అత్యవసరమనుకుంటే.. రెండు వర్గాలకు పంచాయతీ ఉంటే విషయం సుప్రీంకోర్టులో ఉన్నది. న్యాయస్థానాలు ఉన్నవి. వాళ్లు తేలుస్తరు. దాంట్లో మనం జోక్యం చేసుకోవాల్సింది కాదు. ఇవాళ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి.

మాట్లాడితే హిందువు అని మాట్లాడుతరు. ఎవలూ మేమంతా హిందూవులం కాదా? పిలగాండ్లు పుడితే 21 దినం చేసుకోవట్లేమా? పెరిగిన పోరగాండ్లకు అయ్యగార్లను పిలిచి పెండ్లిచేస్తలేమా? చస్తే తద్దినాలు పెట్టుకుంటలేమా? మనం గుళ్లకు పోతలేమా? గుండ్లు కొట్టించుకోవట్లేమా? బీజేపీవొళ్లు చెబితినే మనం పోతున్నమా? ఎంత గరిబీళ్లోనైనా ఆఖరికి దేవుని ఫోటో అయినా ఉంటది ఇంట్లో. రోజు పొద్దున లేస్త దణ్ణం పెడుతం. వీళ్లు చెబితేనే దణ్ణం పెడుతమా? అంటే ఇతర మతాలను తిట్టేవాడే హిందువూ అనే పద్దతిలో మీరు చెబుతున్నరు. కానీ అట్ల చెప్పలే హిందూ మతాలు.. ఆ బోధన చెయలే.. అందర్ని గౌరవించమని చెప్పింది హిందుమతం. అందర్ని ప్రేమించమని చెప్పింది. మీరేమో రాజకీయ హిందూత్వ.. మాది నిజమైన హిందుత్వ.. మేం దేవున్ని నమ్మే హిందూత్వ, మాది ఆధ్యాత్మిక హిందుత్వ.. మీరు డూప్లికేట్ హిందూవులు. ఇంక చాలా రోజులు మీ ఆటలు సాగయ్. సమాజంలో ఇవాళ అన్ని వర్గాలు బాగుండాలి. ప్రజలందరూ బాగుండాలి.

మన వేదాలు ఎక్కడ చెప్పలే పలానోన్ని తిట్టమని, భగవద్గీతల ఎక్కడ చెప్పలే.. భగవంతుడు కూడా ఎక్కడ చెప్పలే. అన్ని మతాలు, అన్ని వర్గాలు, అందరూ బాగుండాలని మేం చెబుతున్నం. మీ ఓట్ల రాజకీయం కోసం, చిల్లర రాజకీయాల కోసం మీరు మాట్లాడాతావున్నారు. ఓ పెద్ద పూజ చేస్తం, యాగం చేస్తం ఎం చెప్తరండి దాని ముగింపులో స్వస్తి ప్రదాబ్యాం పరిపాలయంతాం.. న్యాయేనా మార్గానే మహి మహిశ్యామ్.. గో బ్రాహ్మణనేనా శుభమస్తు నిత్యం.. లోకా సమస్త సుఖినోభవంతు అని చెబుతరు. అంటే సమస్త లోకంలో ఉండేటటువంటి అన్ని వర్గాల మనుషులే కాదు.. సమస్త జీవరాశి కూడా కళ్యాణంగా, సంతోషంగా ఉండాలని చెప్పి చెబుతరు గానీ నీవు ముస్లింలను తిట్టు, నీవు క్రైస్తవులను తిట్టు, ఇదా మీరు చెప్పే రాజకీయం. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా రాజకీయ ఎజెండా మనం తీసుకోవాలి. ప్రజలతోని కలిసి ముందుకు సాగిపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.

2637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles