HomeLATEST NEWSThanksgiving to those who burned the house

ఇళ్లు తగలబెట్టిన వారికి థాంక్స్

Published: Thu,December 14, 2017 10:58 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
రాష్ట్రంలో ఏ మంచిపని జరిగినా అది తాము లోగడ చేసిందేననటం కాంగ్రెస్, టీడీపీలకు ఒక అలవాటుగా మారింది. ఇందుకు గత మూడున్నరేండ్ల కాలంలో అనేక ఉదాహరణలను పేర్కొనవచ్చు. అందులో తాజాది హైదరాబాద్ మెట్రో రైలు. ఇక్కడ మనం ప్రత్యేకంగా మెట్రో గురించి చర్చించటం లేదు. కానీ ఇంత పాలనానుభవం గల పార్టీలు కొన్ని కనీస విషయాలను మరిచిపోయి, రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా నిర్హేతుకంగా మాట్లాడుతాయో దీన్నిబట్టి కన్పిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో వారు అట్లా అంటున్నపుడు అందరూ తేలికగా తీసుకున్నారు. అధికారం రాలేదన్న బాధతో ఏదో మాట్లాడుతున్నారు లెమ్మనుకున్నారు. కాని కాలం గడిచినా కొద్దీ అదే తీరు కొనసాగటంతో కాంగ్రెస్, టీడీపీలకు పరిశీలకులు సూటిగా ఒక ప్రశ్న వేశారు. అన్నీ మీరే చేసి ఉంటే తెలంగాణ ఈ విధంగా ఎందుకు మిగిలిందని అడిగారు. అట్లాగే, మీ పరిపాలనల కాలంలో అభివృద్ధి అంతా జరిగిపోయి ఉంటే ప్రజలు ప్రత్యేక రాష్ర్టాన్ని ఎందుకు కోరుకోవలసి వచ్చిందన్నారు. ఈ రెండు ప్రశ్నలకు ఆ పార్టీల నుంచి సమాధానాలు లేవు. ఈ నాటికీ లేవు. కనీసం ఏదో ఒకటి చెప్పే ప్రయత్నమైనా చేయలేదు. సమాధానాలు చెప్పేందుకు తమ వద్ద ఏమీ లేదని గ్రహించి అంతటితో ఈ మాటలు మానుకున్నారా అంటే అదీ లేదు. దానిని బట్టి వీరు ఎంత బలహీనమైన వారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయం కోసం ఏదైనా మాట్లాడవచ్చునని, దానిని ప్రజలు ఒకప్పటి వలె ఇప్పటికీ నమ్మి ఆమోదించగలరని భావిస్తే వీరివి కాలం చెల్లిన ఆలోచనలన్నమాట.
ఇవే విషయాలనకు మరొకస్థాయిలో విచారిద్దాము. ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలన్నవి ఒక నిరంతర క్రమం. అధికారంలో శాశ్వతంగా ఒకరే ఉండరు గనుక ఒకరు ఆరంభించినవి కొన్ని ఆ తర్వాత పార్టీ ప్రభు త్వ కాలానికి మిగులవచ్చు. మొఘల్-బ్రిటిష్-అసఫ్‌జాహీ-కాంగ్రెస్-టీడీపీల కాలాన్నంతా పరిశీలిస్తే ఇందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు లభిస్తాయి. ఇది సహజం. కనుక విషయాన్ని ఆ దృష్టితో చూడటం సహేతుకమైనది అవుతుంది. అదే సమయంలో ఒక పనిని ప్రారంభించవచ్చుగాక. కాని తర్వాత ఏండ్లకు ఏండ్లు గడిచిపోతున్నా నిధులు కేటాయించక, పని ముందుకుసాగక, ఆ శంకుస్థాపన రాయి ఎక్కడ ఉందో కూడా కన్పించకుండా పోతే వారు ఆ పని ప్రారంభించినదానికి అర్థం ఏముంటుంది? అట్లా ప్రారంభించటంలో వారి అసలు ఉద్దేశం ఏమై ఉంటుందని మనం భావించాలి? ఈ రోజున తెలంగాణలోనే కాదు, దేశమంతటా వెతికితే, దశాబ్దాల క్రితం వేసిన శంకుస్థాపన రాళ్లు ఎన్ని కనిపిస్తాయో అంచనా వేయటం కూడా కష్టమే. ఈ రాళ్లు అభివృద్ధి పరిభాషలో, ప్రజల దృష్టిలో అపహాస్యంగా మారి కూడా దశాబ్దాలు అయింది. అంతెందుకు స్వయంగా ఈ పార్టీల వారే ఒక శంకుస్థాపన రాళ్ల గురించి మరొకరు వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి ఇవే పార్టీలు దీనినంతా విస్మరించి, తర్వాత కాలంలో మరేదైనా కొత్త పార్టీ ఆ పనులను పూర్తిచేస్తే, తమకు దక్కాల్సిన ఖ్యాతిని ఆ కొత్త పార్టీ కొట్టేస్తున్నదని మాట్లాడటానికి విలువ ఏమైనా ఉంటుందా? తాము శంకుస్థాపన రాయి వేయటం, లేదా ఒక ప్రతిపాదనను కేవలం కాగితంపైన రాయటమే, పని అంతా తమ హయాంలోనే జరిగిపోయిందన్నట్లు అవుతుందా?

కాగితంపైన రాయటమంటే గుర్తుకు వస్తున్నది. పెన్ గంగానదిపైన ఆదిలాబాద్ జిల్లాలో చనఖా-కోరటా అనే ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం తప్పనిసరి. ఆ విషయం కాగితంపైన 35 సంవత్సరాల కిందట రాసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత చేసిం ది అక్షరాల శూన్యం. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెంటనే కేసీఆర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపైన మహారాష్ట్రతో చర్చలు జరిపి ఒప్పం దం చేసుకోగా, అదంతా తాము చేసుకున్న ఒప్పందమేనని వారాల తరబడి వాదించారు ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు. అదే నిజమైతే ఆ కాగితాలు తెచ్చి చూపండని, తాను ఇంటికైనా వెళ్లకుండా రాజ్‌భవన్‌కు పోయి సీఎం పదవికి రాజీనామా చేయగలనని కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం వద్ద నిల్చుని సవాలు చేయగా అందరినోళ్లు మూతపడ్డాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటివి ఎన్నయినా చెప్పవచ్చు. గత ప్రభుత్వాల కాగితపు ప్రతిపాదనలు, శంకుస్థాపన రాళ్లు, దశాబ్దాలు గడిచినా కోట్లకు కోట్ల నిధులు జేబులలోకి పోవటం తప్ప పనులు ముం దుకుసాగక తెలంగాణ అధ్వాన్నంగా మిగిలిపోవటానికి సంబంధించిన కథలూ గాథలను. చిన్నవి పెద్దవి కలిపి తెలంగాణ అంతటా గత అరువై ఏండ్ల కాలంలో ఇటువంటివి బహుశా కొన్ని వేలు ఉంటాయి. ఏవో కొన్ని మాత్రం పూర్తయి, కొన్ని కొంతముందుకు సాగి ఉండవచ్చు. ఇటువంటి తమ ఘనమైన చరిత్రను కాంగ్రెస్, టీడీపీ నాయకులు మరిచిపోయినా ప్రజలు మరువలేదు. అందువల్లనే వారికి ఏ స్థానం చూపాలో అది చూపారు. దీనిని వారు ఇప్పటికైనా వినయపూర్వకంగా గుర్తించి వ్యవహరిస్తే వారిపట్ల ప్రజల దృష్టి క్రమంగా మారవచ్చు. కాని ప్రజలను తెలివిలేనివారిగా భావిస్తూ, అన్నీ మేమే చేశాం, అన్నీ మేమే చేశాం పాటను విసుగులేకుండా పాడుతున్నారు.

తెలంగాణ ప్రజల ఇంటిని మొదట 1956లో ఆంధ్రతో వీలీనానికి అంగీకరించింది తగలబెట్టింది కాంగ్రెస్‌వారు. సొంత రాష్ట్రం కోసం, తద్వారా తిరిగి సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రజలు అప్పటినుంచి సాగించిన ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు నిప్పు పెడుతూ స్వప్రయోజనాలను నెరవేర్చుకున్నది వారు. మధ్యలో వచ్చిన టీడీపీలో చేరి అదే పద్ధతిలో నిప్పు పెట్టినది మరికొందరు. ఆ విధంగా తెలంగాణ ప్రజల ఇంటిపై ఉమ్మడిగా దహనకాండ సాగించిన వారు, ఈ ప్రాంతం ఒక అంతర్గత కాలనీగా మారి కునారిల్లుతుండగా తాము మాత్రం అడ్డంగా నిలువుగా పెరిగినవారు, ఇపుడు జరుగుతున్న అభివృద్ధినంతా ఇదివరకు మేం చేసిందిదేనని నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఎవరు చేసిందేమిటో, చేయనిదేమిటో, ఇపుడు జరుగుతున్నదేమిటో బయటివారికి తెలియకపోవచ్చు. కాని తెలంగాణ వాసులకు కాదు గదా. తెలంగాణ పట్ల కాంగ్రెస్ చేసిన మొట్టమొదటి మౌలిక దుర్మార్గం, ద్రోహం ఆంధ్రతో కలుపటం. తర్వాత ఎవరు పాలించినపుడు వారు కాంగ్రెస్, టీడీపీలు చేసిన దుర్మార్గం సీమాంధ్ర పాలకులు, ధనిక వర్గాలు తెలంగాణను దోచుకుంటుండగా నోళ్లు మూసుకొని కూర్చొని, వారువేసిన ఎంగిలి మెతుకులు ఏరుకోవటం.

ఈ పార్టీలకు మాట్లాడితే శ్వేతపత్రాలు అడుగటం ఒక అలవాటుగా మారింది. అట్లా అడుగటం వారి హక్కు గనుక నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చు. కాని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు, ప్రభుత్వాల చరిత్ర గురించి శ్వేతపత్రాలు కోరే హక్కు కూడా ఇక్కడి ప్రజలకు ఉంటుంది. ప్రజలు వద్దువద్దన్నా, వద్దని అంటున్నట్లు ఫజల్ అలీ కమిషన్ స్వయంగా పేర్కొ న్నా కాంగ్రెస్ పార్టీ 1956లో అటువంటి ద్రోహం ఎందుకు చేసిందనే విషయాన్ని నిజాయితీతో వివరిస్తూ ఆ శ్వేత పత్రం మొదలుకావాలి. అప్పటినుంచి మొదలుకొని ఒక దశ వరకు కాంగ్రెస్, తర్వాత ఆ పార్టీతో పాటు టీడీపీల దోపిడీ విద్రోహం, అభివృద్ధి విద్రోహం, సీమాంధ్ర పెత్తందార్లకు బానిసత్వ విద్రోహం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు విద్రోహంపైన అనేకానేక ప్రశ్నలున్నాయి. ఆ మొత్తం అరువై ఏండ్ల చరిత్రపైన రెండు పార్టీల తెలంగాణ నాయకుల నుంచి సమగ్రమైన శ్వేతప్రతాలు కావాలి. అందులో వారు అభివృద్ధి అంతా మేమే చేశాం అధ్యాయం కూడా సంతోషంగా రాసుకోవచ్చు. అందులో నిజముంటే ప్రజలు తప్పక అంగీకరిస్తారు. ఆ మేరకు మెచ్చుతారు. 2019 ఎన్నికలలోగా అటువంటి పత్రాలు సిద్ధం చేసే నిజాయితీ, ధైర్యం వారికున్నాయా? లేక అన్నీ మేమే చేశాం సంగీతమే ఆలపిస్తూ మనకు మరింత విసుగెత్తిస్తారా?
- టంకశాల అశోక్
1707
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology