పల్లె పాలనకు ... ‘పది’ సూత్రాలు

Sat,February 23, 2019 10:15 AM

పల్లెలు ప్రగతి సాధించేందుకు సర్కారు పది సూత్రాలు పక్కాగా అమలు చేయనున్నది. దీంతో గ్రామ స్వరాజ్యానికి బాటలు పడనున్నాయి. పల్లెల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు నూతన చట్టం ప్రకారం పాలన సాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అధికారాలు, విధులు, నిధుల వినియోగం పకడ్బందీగా జరిగేలా చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది. గ్రామసభ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు పడనున్నది. అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శికి కీలకమైన 30 రకాల విధుల్ని అప్పగించింది. పల్లెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటుగా అభివృద్ధిలో ముందు భాగంలో నిలిపేందుకు సర్పంచ్‌తో పాటుగా పంచాయతీ కార్యదర్శికి పది సూత్రాలను తాజాగా అందించింది. గత ఏడాది తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారమే రిజర్వేషన్లతో ఎన్నికలు పూర్తి చేసింది. ఇప్పుడు గెలిచిన పాలకవర్గం ఇప్పుడీ చట్టాన్నే అమలు చేయాల్సి ఉన్నది.


ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వచ్చే ఏ అధికారి అయినా పల్లె పాలకవర్గంతో మమేకం కావాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేసి స్థానిక సంస్థలకు విశేష అధికారాలను ఇవ్వడంపై సర్వత్రా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పంచాయతీల్లో సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు కొత్త పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. అధికారాలు, విధులు, నిధుల వినియోగానికి సంబంధించిన చెక్‌పవర్, పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ, సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనులు ఇలా అనేక విషయాలను పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచారు. ప్రజలకు నేరుగా సేవలు అందించడంలో పంచాయతీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నది. నూతన పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచ్‌కి విధులతో పాటు గతంలో లేని విధంగా తప్పనిసరిగా పాటించాల్సిన విధులున్నాయి. ప్రధానంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ కల్పించారు. ఇదిలావుండగా గ్రామ సభలను సరిగ్గా నిర్వహించకపోతే సర్పంచ్‌ని పదవీ నుంచి తొలిగించేలా చట్టంలో నిబంధనలు పొందుపర్చారు. రెండు నెలలకోసారి గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏడాదికి ఆరు గ్రామ సభలు, చివరి రెండు సభలు కేవలం మహిళలు, వృద్ధులతోనే నిర్వహించాలి. గ్రామ సభల విషయంలో మరిన్ని నిర్వహణ పరమైన నిబంధనలను చట్టంలో పేర్కొన్నారు.

కొత్త చట్టంతో గ్రామాల్లో ...ఆశించిన సత్ఫలితాలు


కొత్త చట్టంతో గ్రామాల్లో అభివృద్ధి సాధించడంతో ప్రభుత్వం ఆశించిన సత్ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. గ్రామాల అభివృద్ధికి తీసుకున్న ఈ నూతన చర్యలు పల్లెల్లో కొత్త మార్పుకు సంకేతంగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలు ఐకమత్యంగా ఉండటం వల్ల సగం అభివృద్ధిని సాధించినట్లవుతుంది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం విధులు, బాధ్యతలపై పంచాయతీ కార్యదర్శులు పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవడంతో గ్రామాల అభివృద్ధికి మార్గం సుగమమవుతున్నది. జిల్లాలో 220 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఇంతకాలం పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలంతా మళ్లీ పల్లెలకు తరలివచ్చేలా కొత్త పంచాయతీరాజ్ చట్టం తెలియజేస్తున్నది.

పాలకవర్గానికి పది సూత్రాలు...


* ప్రతి నెలా వీధి దీపాల పరిశీలన చేయాలి.
* నెలలో ఎన్ని కొత్త లైట్లు అమర్చారో నోటీస్ బోర్డుపై వివరాల నమోదు చేయాలి.
* ప్రతి నెలా పింఛన్లు ఎవరికి రావాలో, ఇప్పటి వరకు ఎన్ని పింఛన్లు ఇస్తున్నారో ప్రదర్శించాలి.
* నీరు, ఇంటి పన్నులు పెండింగ్, వసూళ్ల వివరాలను నోటీస్ బోర్డులపై సూచించాలి.
* పండుగల ఖర్చులు, నిధులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు చేశారో నోటీస్ బోర్డుపై ఉంచాలి.
* నెలలో ఒక వారంలో మరుగుదొడ్ల వాడకం, చెత్తకుండీల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు.
* గ్రామసభ నిర్వహించడంతో పాటుగా ప్రజల సమక్షంలో గ్రామంలోని అవసరాలను గుర్తించాలి.
* ప్రతి ఇంటి ఆవరణలో కనీసం నాలుగు మొక్కలు నాటించాలి.
* రేషన్ దుకాణాలకు ఎంత బియ్యం వస్తున్నాయి, ఎంత పంపిణీ అవుతున్నాయో తెలుసుకోవాలి.
* మరుగుదొడ్డి లేకుంటే కొత్తది కట్టించేలా చర్యలు తీసుకోవాలి.

పంచాయతీ కార్యదర్శుల విధులు...


* ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్ర స్థాయిలో సక్రమంగా వినియోగించాలి.
* పన్నుల వసూళ్లలో లక్ష్యం మేరకు పనిచేయాలి.
* భవన నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన అనంతరం 24 గంటల్లో అనుమతులు ఇవ్వాలి.
* పారిశుధ్య పర్యవేక్షణ ప్రతినిత్యం జరపాలి. సిబ్బంది పనితీరును గమనించాలి. చెత్త తరలింపు లాంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి.
* తాగునీటి సమస్యపై అధికారులకు తెలియజేస్తూ, పరిష్కార బాధ్యతను తీసుకోవాలి.
* గ్రామ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణను తొలిగించాలి.
* సర్పంచులతో కలసి పనులు పర్యవేక్షించాలి. ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలి.
* గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించాల్సిన తేదీని సర్పంచుకు తెలియజేయడం, సర్పంచ్ ఆమోదంతో సమావేశానికి ఏర్పాట్లు చేయడం. తీర్మానాలను ఈవోపీఆర్డీకి పంపడం.
* గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, వచ్చే ఏడాదిలో చేపట్టే పనులను కూడా ప్రతిపాదించడం.

4262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles