సెల‌వుల్లో తెలంగాణ జ‌ల‌పాతాలు చూసొద్దాం...

Wed,September 13, 2017 01:01 PM

telangana waterfalls telangana tourism

చినుకులా రాలి... గలగలా పారి.. కొండాకోనలు దాటుతున్నాయి. ఎచటెచటి నుంచో జలపాతాలైఉరికి దుమికి వస్తున్నాయి.అంతులేని ఉత్సాహాన్ని అమితమైన ఆనందాన్ని మన వదనాలపై చిలకరిస్తున్నాయి ఒకటా.. రెండా.. తెలంగాణలో ఉన్న అన్ని జలపాతాలు ఎప్పుడూ లేనన్ని హొయలు పోతున్నాయి. మనుపెన్నడూ లేని విధంగా కనువిందు చేస్తున్నాయి ఆ చిత్ర మాలిక మీకోసం..

కుంటాల జలపాతం:

ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామంలో ఉంది. జిల్లా కేంద్రం నుంచి నేరడిగొండకు ఆర్టీసీ బస్సుల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి 13 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుంటాల జలపాతానికి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి NH44(NH7)పైన 237 కిలోమీటర్లు వెళితే నేరడిగొండ మండల కేంద్రం వస్తుంది. అక్కడి నుంచి కుడి చేయి వైపు 13 కిలోమీటర్లు వెళితే కుంటాల జలపాతం అందాలు చూడవచ్చు.

పొచ్చెర జలపాతం

పొచ్చెర జలపాతం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో 44 జాతీయ రహదారికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. నిర్మల్ నుంచి 38 కిలో మీటర్లు, హైదరాబాద్ నుంచి 242 కి.మీ. ప్రయాణించిన తరువాత బోథ్ ఎక్స్ రోడ్ నుంచి ఎడమవైపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే పొచ్చర జలపాతం అందాలు చూడవచ్చు.

గౌరీ గుండాల

ఇది కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్-పెద్దపల్లి మండలాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. జిల్లా కేంద్రానికి 42 కి.మీ. ఉంటుంది. హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి రైలు సౌకర్యం ఉంది. పెద్దపల్లి మండలకేంద్రం నుంచి మంథని బస్సులో సబ్బితం వరకు 12 కిలో మీటర్లు ప్రయాణించాలి. అక్కడి నుంచి రెండు కిలో మీటర్ల దూరం వెళితే గౌరీగుండం జలపాతం చేరుకోవచ్చు.

భీముని పాదం

వరంగల్ జిల్లా, గూడూరు మండలం కొమ్ములవంచ గ్రామపంచాయతీ శివారు అటవీ ప్రాంతంలోని గుట్టల్లో భీమునిపాదం జలపాతం ఉంది. జిల్లా కేంద్రానికి 53 కిలో మీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి బస్సుల్లో వెళ్లే వారు వయా నర్సంపేట మీదుగా గూడూరు మండలం, భూపతిపేటకు చేరుకోవాలి. అక్కడి నుంచి 6 కి.మీ. దూరంలో ఉన్న జలపాతానికి ప్రైవేట్ వాహనాల్లోగాని, సొంత వెహికిల్స్‌లో ప్రయాణించి చేరుకోవచ్చు.

ఏడు జలపాతాలు

ఇది ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో ఉంది. ఇల్లెందు పట్టణం నుంచి 18 కిలో మీటర్ల ప్రయాణించి, ఏడు జలపాతాలు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వయా ఖమ్మం మీదుగా 270 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఏడు జలపాతాలు చేరుకోవాలంటే మూడు కిలో మీటర్ల దూరంలో వాహనాలు నిలిపి నడవాల్సి ఉంటుంది.

బొగత జలపాతం

ఇది ఖమ్మం నుంచి 240 కిలోమీటర్లు, వాజేడు మండలకేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఖమ్మం నుంచి వెళ్లే వారు వయా భద్రాచలం మీదుగా వాజేడు చేరుకుని.. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో బొగత జలపాతం చేరుకోవచ్చు. అలాగే, హైదరాబాద్ నుంచి 270 కిలో మీటర్లు ఉంటుంది. రాజధాని నుంచి వెళ్లే వారు వరంగల్ జిల్లా ఏటూరునాగారం గోదావరి బ్రిడ్జి మీదుగా వాహనాల ద్వారా బొగత జలపాతానికి చేరుకోవచ్చు.

గుండాల జలపాతం

ఇది మహబూబ్‌నగర్ జిల్లా, ఆత్మకూరు మండలకేంద్రం నుంచి 4 కిలో మీటర్ల దూరంలో కృష్ణానది మధ్యలో ఉంది. దీన్ని లిటిల్ నయాగరా జలపాతంగా కూడా పిలుస్తారు. మహబూబ్‌నగర్ నుంచి 64 కిలో మీటర్లు ఉంటుంది. బస్సుల్లో వెళ్లే వారు జిల్లా కేంద్రానికి 60 కి.మీ. ఉన్న ఆత్మకూరుకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా గుండాల జలపాతానికి చేరుకోవచ్చు. రైళ్లలో వెళ్లే వారు శ్రీరాంనగర్, వనపర్తిరోడ్డు రైల్వే స్టేషన్లలో దిగాలి. అనంతరం బస్సుల ద్వారా ఆత్మకూరుకు చేరుకుని, అక్కడి నుంచి ఆటోల ద్వారా జలపాతం వద్దకు చేరుకోవచ్చు.

సప్త గుండాల (మిట్టె)

ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(యూ) మండలం పీఠగూడ, లింగాపూర్ గ్రామాల నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో సప్తగుండాల(మిట్టె) జలపాతం ఉంది. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి జైనూర్ మండలకేంద్రం మీదుగా బస్సుల్లో సిర్పూర్(యూ) మీదుగా పీఠగూడ, లింగాపూర్ వెళ్లాలి. పీఠగూడ జైనూర్ నుంచి 18 కిలో మీటర్ల దూరంలో ఉంది.

రథం గుట్ట జలపాతం

రథం గుట్ట జలపాతం ఖమ్మం జిల్లా మణుగూరుకు కిలో మీటర్ దూరంలో ఉంటుంది. కాలినడకనే వెళ్లాలి. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు వయా ఖమ్మం మీదుగా 332 కిలో మీటర్లు ప్రయాణించాలి. వరంగల్ వయా ఏటూరునాగారం నుంచి అయితే 335 కిలో మీటర్ల ప్రయాణించి రథంగుట్ట జలపాతానికి చేరుకోవచ్చు.

8306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS